Ravi Chettu : చెట్లను కూడా పూజించే సంప్రదాయాన్ని మనం భారత దేశంలో చూడవచ్చు. ఎంతో కాలంగా మనం చెట్లను పూజిస్తూ ఉన్నాం. మనం పూజించే చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి. భూమి మీద పుట్టిన మొదటి చెట్టు రావి చెట్టని, సకల దేవతా శక్తులన్నీ నివాసముండే చెట్టు కూడా రావి చెట్టేనని ఋషులు ఏనాడో చెప్పారు. ఈ చెట్టు రాత్రి, పగలు ఆక్సిజన్ ను అందిస్తూనే ఉంటుంది. రావి చెట్టు విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇది అందరికీ తెలిసిన వృక్షమే. ఈ చెట్టు ఎంతో పెద్దగా ఉంటుంది. 100 సంవత్సరాలకు పైగా బ్రతుకుతుంది. ఆయుర్వేదంలో కూడా ఈ చెట్టును ఉపయోగించి అనేక రకాల అనారోగ్య సమస్యలను నయం చేస్తున్నారు. ఏయే రోగాలను నయం చేయడంలో రావి చెట్టు ఉపయోగపడుతుంది. దీనిని ఎలా ఉపయోగించాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
దీనిలో ఉండే చలువ చేసే గుణం చర్మం కాంతివంతంగా మెరిసేలా చేయడంలో సహాయపడుతుంది. స్త్రీలలో వచ్చే యోని దోషాలను తొలగించడంలో, రక్తాన్ని శుద్ది చేయడంలో, వ్రణాలను తొలగించడంలో కూడా ఈ చెట్టు ఉపయోగపడుతుంది. రావి చెట్టు బెరడును నానబెట్టిన నీళ్లను కానీ, బెరడుతో చేసిన కషాయాన్ని కానీ రెండు పూటలా తాగుతూ ఉండడం వల్ల సెగ రోగాలు, మూత్రంలో మంట, మూత్రాశయ సంబంధిత సమస్యలన్నీ తగ్గుతాయి.
నడుము నొప్పితో బాధపడే వారు రావి చెట్టు బెరడును ముక్కలుగా చేసి నీడలో ఎండబెట్టి పొడిగా చేసి ఆ పొడిని ఒక టీ స్పూన్ చొప్పున ఒక కప్పు నీళ్లల్లో కలుపుకుని తాగడం వల్ల నడుము నొప్పి తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది. రావి చెట్టు బెరడును ఎండబెట్టి పొడిలా చేసి నిల్వ చేసుకోవాలి. శరదృతువులో పౌర్ణమి రోజున ఆవుపాలు, బియ్యం, పంచదారతో పాయసాన్ని చేయాలి. ఈ పాయసాన్ని 100 గ్రా. ల మోతాదులో తీసుకుని అందులో 5 గ్రా. ల రావి చెట్టు బెరడు పొడిని కలిపి వెన్నెల తగిలేలా ఆరబెట్టాలి. ఈ పాయసాన్ని ఆస్తమా రోగికి ఇచ్చి రోగిని రాత్రంతా మెలుకువగా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఆస్తమా ఒక్క రోజులోనే నయం అవుతుందని చెబుతున్నారు.
వెక్కిళ్లను తగ్గించే గుణం కూడా రావి చెట్టుకు ఉంది. రావి చెట్టు బెరడును కాల్చగా వచ్చిన బూడిదను తమలపాకులో వేసి చుట్టి దానిని తింటూ కొద్ది కొద్దిగా రసాన్ని మింగుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల వెక్కిళ్లు వెంటనే తగ్గుతాయి. రావి చెట్టు లేత ఆకులను తీసుకుని 4 లీటర్ల నీటిలో వేసి లీటర్ నీళ్లు అయ్యే వరకు మరిగించాలి. ఇందులో ఒక కిలో పంచదారను వేసి చిన్న మంటపై పాకం వచ్చే వరకు ఉడికించాలి. ఈ లేహ్యాన్ని రెండు పూటలా 10 గ్రా. ల చొప్పున తింటూ ఉండడం వల్ల స్త్రీ, పురుషులిద్దరిలో శారీరక బలం పెరుగుతుంది. అలాగే లైంగిక సామర్థ్యం కూడా పెరుగుతుంది.
రావి చెట్టు ఆకుల రసాన్ని లేదా రావి చెట్టు పాలను రాత్రి పూట పగిలిన పాదాలకు రాసి ఉదయం పూట కడిగేయాలి. ఇలా చేయడం వల్ల పాదాల పగుళ్లు తగ్గుతాయి. రావి చెట్టు బెరడును నీటిలో వేసి మరిగించాలి. ఈ నీరు గోరు వెచ్చగా ఉన్నప్పుడే నోట్లో పోసుకుని పుక్కిలించడం వల్ల దంతాల సమస్యలు తగ్గుతాయి. సంతానాన్ని కలిగించే శక్తి కూడా రావి చెట్టుకు ఉంది. రావి చెట్టు గింజలతో చేసిన పొడిని బహిష్టు స్నానం చేసిన రోజు నుండి 14 రోజులు క్రమం తప్పకుండా ఒక స్పూన్ మోతాదుగా రెండు పూటలా తీసుకుంటూ ఆవు పాలను తాగడం వల్ల స్త్రీలల్లో వచ్చే సంతాన లేమి సమస్యలన్నీ తగ్గి సంతానం కలుగుతుంది.
రావి చెట్టు చిగుళ్లను ఆవు పాలలో వేసి మరిగించి రెండు పూటలా తీసుకుంటూ ఉండడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రావి చెట్టు గింజల పొడిని 10 గ్రా. ల మోతాదులో తీసుకుని దానికి 10 గ్రా. తేనెను కలిపి ఉదయం పరగడుపున తీసుకుంటూ ఉండడం వల్ల రక్తం శుద్ది అవుతుంది. వ్రణాలు, కణతులు తగ్గుతాయి. రావి చెట్టు బెరడును నీటితో కలిపి నూరి నోట్లో పూతగా రాయడం వల్ల నోటి పూత, నోటిలో పుండ్లు, నాలుక పగుళ్లు తగ్గుతాయి. రావి చెట్టు బెరడు పొడిని రోజుకి మూడు సార్లు వెన్న, పంచదారతో కలిపి తినడం వల్ల గర్భస్రావం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్టు బెరడు పొడిని గాయాలపై రాయడం వల్ల గాయాలు త్వరగా తగ్గుతాయి. ఇలా రావి చెట్టుతో మనం అనేక లాభాలను పొందవచ్చు.