వేడి వేడిగా అప్పుడే దించిన ఇడ్లీలు… అందులోకి కొద్దిగా కారంపొడి, దాంట్లో కొంచెం నెయ్యి, కొద్దిగా కొబ్బరి పచ్చడి లేదా పల్లీల చట్నీ. కొంచెం సాంబార్..! ఇవి ఉంటే చాలు… ఇడ్లీలను ఎవరైనా ఎంజాయ్ చేస్తారు. వేడి వేడిగా ఈ పదార్థాలన్నీ నోరు ద్వారా గొంతు దిగుతుంటే… అబ్బో… వారెవ్వా… ఆ మజాయే వేరు కదా..! మరి… ఇలాంటి సాధారణ ఇడ్లీలకే మీకు నోరు అంత ఊరుతుంటే… ఇక ఆ ప్రాంతంలో స్పెషల్‌గా వండే ఇడ్లీల పేరు చెబితే… మీరు వాటి కోసమే అంత దూరం వెళ్లి తిని వస్తారు..! అవును, మేం చెబుతోంది నిజమే. అంతటి ప్రత్యేకత ఆ ఇడ్లీల్లో ఉంది మరి..! ఇంతకీ ఆ ఇడ్లీలు ఎక్కడ దొరుకుతాయో తెలుసా..?
అది కేరళ రాష్ట్రంలోని పాలక్కడ్ జిల్లా రామస్సెరి గ్రామం. అక్కడే సరస్వతి టీ స్టాల్ అని ఓ చిన్నపాటి హోటల్ ఉంటుంది. అది పేరుకే టీ స్టాల్ కానీ, అందులో పైన చెప్పిన విధంగా ఉండే నోరూరించే ఇడ్లీలు దొరుకుతాయి. వాటిని ఆ హోటల్ వారు ఎలా తయారు చేస్తారో తెలుసా..? ప‌్రత్యేకంగా తయారు చేసిన పిండిని వస్త్రంపై కొద్దిగా ఎడంగా పోసి అనంతరం ఆ వస్త్రాలన్నింటినీ ఒక పాత్రలో ఉంచుతారు. దానిపై మరో పాత్రను బోర్లిస్తారు. ఆ పాత్రలు మట్టితో చేసినవే. అనంతరం వాటిని పొయ్యిపై ఉంచి ఉడికిస్తారు. పొయ్యిలో వారు చింత చెట్టు కలపను మంట కోసం వాడుతారు. దీంతో ఆ ఇడ్లీలు తయారవుతాయి. అలా తయారైన ఇడ్లీలతో ఆ హోటల్ వారు కారంపొడి, కొబ్బరి చట్నీ, సాంబారు ఇస్తారు. అలా ఆ ఇడ్లీలను ఎంచక్కా ఎవరైనా ఆరగించవచ్చు. అయితే వాటి టేస్ట్ ఎలా ఉంటుందో తెలుసా..? పైనే చెప్పాం కదా..! వాటి కోసం మీరు అంత దూరం వరకైనా వెళ్తారని, అవును, ఆ ఇడ్లీల టేస్ట్ అంత బాగుంటుంది మరి..!
నిజానికి ఆ హోటల్ వారిది ఒకప్పుడు తమిళనాడు రాష్ట్రమట. వారు బ్రతుకు దెరువు నిమిత్తం కేరళకు వచ్చి అలా ప్రత్యేకమైన రెసిపి సహాయంతో ఇడ్లీలను వండడం స్టార్ట్ చేశారు. దీంతో వారి బిజినెస్ దిన దిన ప్రవర్థమానం ఎదిగిపోయింది. ఇప్పుడు వారికి ఆ గ్రామం చుట్టు పక్కల అలాంటివే మరో నాలుగు స్టాల్స్ ఉన్నాయి. అన్నింట్లోనూ వారు ఇడ్లీలను అచ్చం ఇలాగే ఏ మాత్రం టేస్ట్ పోకుండా, సేమ్ సైజ్‌తో వండి పెడతారు. అయితే వారి ఇడ్లీల్లో వాడే పదార్థాలేంటో ఇప్పటికీ రహస్యమే. దాన్ని ఎవరూ చెప్పలేరు, కనుక్కోలేరు. ఈ క్రమంలో వారు రోజుకు ఒక్కో స్టాల్ ద్వారా దాదాపుగా 500 నుంచి 2వేల వరకు ఇడ్లీలను అమ్ముతారు. పండుగ రోజుల్లో అయితే ఆ సంఖ్య 15వేల వరకు ఉంటుందంటే నమ్మగలరా..! చాలా మంది ఆర్డర్ల ద్వారా ఫంక్షన్ల కోసం కూడా ఇడ్లీలను చేయించుకుంటారు. అదీ… ఆ ఇడ్లీల మహిమ. మీలో ఎవరైనా అటు వెళ్తే కచ్చితంగా ఓ సారి ఆ ఇడ్లీలను టేస్ట్ చేయడం మాత్రం మరువకండి..!