Cross Legged Position : ఎవరైనా పడుకునే భంగిమలు వేరేగా ఉన్నట్టే కూర్చునే భంగిమలు కూడా వేరే ఉంటాయి. అంటే.. ఒక్కొక్కరూ ఒక్కో రకమైన భంగిమలో వారి అనుకూలత, సౌకర్యాన్ని బట్టి కూర్చుంటారు. అది కుర్చీ అయినా, మంచం అయినా, వేరే ఏ ఇతర ప్రదేశం అయినా కూర్చునే భంగిమలు ఒక్కొక్కరికీ వేర్వేరుగా ఉంటాయి. అయితే చాలా మంది కూర్చునే భంగిమ ఒకటుంది. అదే క్రాస్ లెగ్ పొజిషన్. అంటే కాళ్లను ఒకదానిపై ఒకటి క్రాస్ గా వేసి కూర్చుంటారన్నమాట. అయితే ముఖ్యంగా మహిళలు ఈ భంగిమలో కూర్చుంటారు. ఆ మాట కొస్తే పురుషుల్లోనూ ఇలా కూర్చునేవారున్నారు. అయితే మీకు తెలుసా..? నిజానికి ఈ క్రాస్ లెగ్ పొజిషన్‌లో కూర్చోకూడదట. ఎందుకంటే అలా కూర్చుంటే పలు అనారోగ్య సమస్యలు వస్తాయట. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రాస్ లెగ్ పొజిషన్‌లో కూర్చోవడం వల్ల peroneal nerve paralysis లేదా palsy అనే సమస్య వస్తుందట. దీని వల్ల కాళ్లలో ఉండే నరాలపై ఒత్తిడి బాగా పడుతుంది. నొప్పి కలుగుతుంది. నరాలు శక్తిని కోల్పోతాయి. క్రాస్ లెగ్ పొజిషన్‌లో కూర్చుంటే రక్త సరఫరాకు ఆటంకం కలుగుతుందట. దీంతో బీపీ పెరుగుతుందట. 2010 లో పలువురు సైంటిస్టులు ఈ విషయాన్ని నిరూపించారు కూడా. ఈ పొజిషన్‌లో కూర్చోవడం వల్ల దీర్ఘకాలింగా కీళ్ల నొప్పుల సమస్య వస్తుందట. కీళ్లు, కండరాల కదలికలు సరిగ్గా ఉండవట.
క్రాస్ లెగ్ పొజిషన్‌లో కూర్చోవడం వల్ల spider veins అనే సమస్య వస్తుంది. ఇది వెరికోస్ వీన్స్‌కు దారి తీయవచ్చు. దాంతో కాళ్లల్లో ఉండే రక్త నాళాలు ఉబ్బుతాయి. రక్తం గడ్డ కడుతుంది. వెన్నెముక, మెడ, తొడలు, కండరాల నొప్పులు వస్తాయి. శరీర భంగిమ మారుతుంది. సరిగ్గా నిలబడలేరు, కూర్చోలేరు. అందువల్ల ఈ భంగిమలో అసలు కూర్చోకూడదని నిపుణులు చెబుతున్నారు.