Fenugreek Seeds Sprouts : మన వంటింట్లో ఉండే దినుసుల్లో మెంతులు ఒకటి. మెంతులను కూడా మనం వంటల్లో వాడుతూ ఉంటాం. మెంతులు చేదుగా ఉంటాయన్న కారణం చేత వీటిని చాలా మంది తీసుకోవడానికి ఇష్టపడరు. కానీ మెంతులను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మెంతులను నేరుగా తీసుకోవడం కంటే వాటిని మొలకెత్తించి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెంతులను మొలకెత్తించి తీసుకోవడం వల్ల వాటిలో ఉండే చేదు తగ్గడంతో పాటు పోషకాల శాతం పెరుగుతుంది. మెంతులను మొలకెత్తించి తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అలాగే మెంతులు చక్కగా మొలకలు రావడానికి పాటించాల్సిన పద్దతులు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా మెంతులు చక్కగా మొలకలు రావడానికి పాటించాల్సిన పద్దతుల గురించి తెలుసుకుందాం. ఒక గిన్నెలో ఒక కప్పు మెంతులను తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత కావాల్సిన దాని కంటే కూడా ఎక్కువగా నీటిని పోసి 16 నుండి 18 గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత వాటిని మరో రెండు సార్లు బాగా కడగాలి. తరువాత మెంతులను వడకట్టి వస్త్రంతోపై పోసి తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. తరువాత ఈ మెంతులను కాటన్ వస్త్రంలో వేసి గట్టిగా మూట కట్టాలి. ఈ మూటను గిన్నెలో ఉంచి దానిపై పెట్టాలి. గాలి పోకుండా మూతపై ఏదైనా బరువైనా వస్తువును కూడా ఉంచవచ్చు. ఈ మూటను కదిలించకుండా ఒకటిన్నర రోజు పాటు లేదా రెండు రోజుల పాటు అలాగే ఉంచాలి. తరువాత మూట నుండి వేరు చేసి మెంతి మొలకలను గిన్నెలోకి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల మెంతులు చక్కగా మొలకలు వస్తాయి. మనకు ప్రస్తుత కాలంలో మార్కెట్ లోమొలకలు తయారు చేసుకోవడానికి చిల్లులు ఉన్న గిన్నెలు కూడా లభిస్తున్నాయి. ఆ గిన్నెలో కూడా ఇదే విధంగా నానబెట్టుకుని పూర్తిగా ఆరిన తరువాత మొలక కట్టుకోవాలి. ఇలా ఒకేసారి ఎక్కువ మొత్తంలో కూడా మెంతి మొలకలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా మెంతులను మొలకెత్తించి తీసుకోవడం వల్ల మనం మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు. మెంతులను మొలకెత్తించి తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా ఈ మొలకెత్తిన మెంతి గింజలను తినడం వల్ల బరువు తగ్గవచ్చు.
జీర్ణశక్తి మెరుగుపడి మలబద్దకం సమస్య తగ్గుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. అలాగే చర్మం మరియు జుట్టు ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. బాలింతలు వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల వారిలో పాల ఉత్పత్తి పెరుగుతుంది. మోనోపాజ్ దశలో ఉన్న స్త్రీలు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చు. మెంతి మొలకలను ఉదయం అల్పాహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను చాలా సులభంగా దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.