Putnala Pappu : ప్రోటీన్స్ ను అధికంగా కలిగిన ఆహార పదార్థాలలో పుట్నాల పప్పు ఒకటి. వీటిని తినడం వల్ల మన శరీరానికి కావల్సిన ప్రోటీన్లు లభిస్తాయి. మనం పుట్నాల పప్పును ఉపయోగించి రకరకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. పుట్నాల పప్పుతో చేసే కారం పొడి చాలా రుచిగా ఉంటుంది. పుట్నాల కారాన్ని మనం అన్నం, దోశ, ఉప్మా వంటి వాటితో కలిపి తింటూ ఉంటాం. వివిధ రకాల కూరగాయల వేపుడులను చేసేటప్పుడు వాటిలో మనం పుట్నాలను కానీ వాటితో చేసిన కారాన్ని కానీ వేస్తూ ఉంటాం.
పుట్నాల పప్పును శనగల నుండి తయారు చేస్తారు. వీటిని తరచూ ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణాశయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. బరువు తగ్గడంలో కూడా పుట్నాలు ఎంతో సహాయపడతాయి. పుట్నాల పప్పును బెల్లంతో కలిపి తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది. చర్మంపై ఉండే ముడతలను తొలగించే సామర్థ్యం పుట్నాల పప్పుకు ఉంది.
చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడడం, జుట్టు రాలడం వంటి సమస్యలతో ప్రస్తుత కాలంలో చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వారు పుట్నాల పప్పును రోజూ తినడం వల్ల జుట్టు రాలడం తగ్గి, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. పుట్నాల పప్పుతో మనం లడ్డూలను కూడా తయారు చేసుకుని తినవచ్చు. ఇలా తయారు చేసుకుని తినడం వల్ల స్త్రీలలో నెలసరి సమస్యలు తగ్గుతాయని, గర్భిణీలు కూడా పుట్నాల లడ్డూలను తినడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చని.. నిపుణులు చెబుతున్నారు.