Diabetes : షుగర్ వ్యాధి.. ప్రస్తుతం మనల్ని వేధిస్తున్న అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి. ఈ సమస్య బారిన పడే వారు రోజురోజుకూ ఎక్కువవుతున్నారు. ఒకసారి ఈ వ్యాధి బారిన పడితే ఇక జీవితాంతం మందులు వాడాల్సిందే. షుగర్ వ్యాధిన పడిన వారు దాని గురించి అవగాహాన పెంచుకుని సరైన నియమాలను పాటిస్తూ ఉంటే అది నియంత్రణలో ఉంటుంది. ఈ షుగర్ వ్యాధిని ఏ మాత్రం నిర్లక్ష్యం చేసిన అది ప్రాణాలకే ముప్పుగా వాటిల్లుతుంది. అయితే షుగర్ వచ్చిన తరువాత దాని వల్ల కలిగే అస్వస్థత కంటే ఎక్కువ సందేహాలు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. దానికి తోడు షుగర్ వచ్చిందని తెలియగానే మన బంధువులు, సన్నిహితులు ఇచ్చే సలహాలు ఎక్కువవుతూ ఉంటాయి. తమకి తెలిసినవన్ని చెప్పేసి మనల్ని సందేహంలో పడేస్తూ ఉంటారు. షుగర్ వ్యాధికి సంబంధించిన అపోహలు ఎక్కువైపోతుంటాయి.
షుగర్ వ్యాధికి సంబంధించిన కొన్ని వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి డయాబెటిస్ ను అంత తేలికగా తీసుకోకూడదు. ప్రస్తుతం ఈ వ్యాధితో మన దేశంలో ఏడు కోట్ల మంది బాధపడుతున్నారు. ఈ సంఖ్య దాదాపు 10 కోట్ల వరకు చేరే అవకాశం ఉందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. మధుమేహం వచ్చిన వెంటనే ఇక జీవితంలో రుచి పోయిందని చాలా మంది బాధపడుతుంటారు. ఇక తీపితో తమకు రుణం తీరిపోయిందని బాధపడుతుంటారు. అలాగే తీపి పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల కూడా షుగర్ వ్యాధి వస్తుందని భావిస్తారు. ఇది కొంత నిజమైనప్పటికి అంతా నిజం కాదు. శరీరంలో ఉండే ప్రాంకియాటిస్ గ్రంథి సరైన ఇన్సులిన్ ను ఉత్పత్తి చేయకపోయిన లేక షుగర్ లెవల్స్ పెరగకుండా చేసే ఇన్సులిన్ తక్కువగా ఉత్పత్తి చేసిన మధుమేహం వ్యాధి వస్తుంది.
అలాగే చాలా మంది షుగర్ వ్యాధి గ్రస్తులు తీపి మానేస్తున్నాం కనుక కారం, వేయించిన పదార్థాలు ఎక్కువగా తినవచ్చని భావిస్తారు. కానీ నూనెలో వేయించిన పదార్థాలు కారానివైనా, తీపివైనా తినకూడదు. షుగర్ కు శరీరంలో కొలెస్ట్రాల్ కు కూడా కూడా సంబంధం ఉంటుంది. అలాగే షుగర్ వ్యాధి బారిన పడగానే అన్నం తినడం మానేయాలి కేవలం చపాతీలనే తినాలని అని చాలా మంది అనుకుంటారు. కానీ వీరు తగిన మోతాదులో అన్నాన్ని కూడా తినవచ్చు. చపాతీలో అలాగే అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్ల స్థాయి ఒకేలా ఉంటుంది. అదే విధంగా షుగర్ వ్యాధి గ్రస్తులు పండ్లు తినకూడదని చాలా మంది అనుకుంటారు. కానీ పండ్లను తినకూడదు అనేది అపోహ మాత్రమే. వీరు అన్ని రకాల పండ్లను తినవచ్చు. భోజనంతో పాటు కాకుండా భోజన విరామ సమయంలో స్నాక్స్ గా ఈ పండ్లను తినవచ్చు.
డయాబెటిస్ ను నియంత్రించకపోతే మూత్రపిండాల సమస్యలు, కంటి చూపు మందగించడం, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కొన్ని రకాల క్యాన్సర్ లు వచ్చే అవకాశం ఉంది. కనుక దీనిని తేలికగా తీసుకోకూడదు. అదే విధంగా షుగర్ వ్యాధి బారిన పడితే స్త్రీలు గర్భం దాల్చలేరని ఒకవేళ దాల్చిన కూడా పుట్టబోయే బిడ్డలు అనారోగ్యంతో పుడతారని చాలా మంది అనుకుంటారు. కానీ సరైన ఆహార నియమాలను పాటిస్తూ తరచూ వ్యాయామం చేస్తూ షుగర్ కు సంబంధించిన మందులు వాడితే తల్లి కావచ్చు.
అలాగే చాలా మంది మా వంశంలో డయాబెటిస్ బారిన పడిన వరాఉ ఎవరు లేరు కనుక నాకు కూడా షుగర్ రాదు అని చాలా భావిస్తారు. ఇది అపోహ మాత్రమే. సమయానికి తినకపోయిన తగినంత తినకపోయిన పోషకాలు తక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కవగా తిన్నా కూడా డయాబెటిస్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధిని పూర్తిగా నివారించే మందులు లేవు. డయాబెటిస్ జీవితాంతం ఉంటుంది. కనుక డయాబెటిస్ ఉన్న వారు తరచూ పరీక్షలు చేయించుకుంటూ మందులను వాడుతూ ఆహార నియమాలను పాటిస్తూ ఉంటే ఎలాంటి ప్రమాదం ఉండదు.