Mangoes Benefits : మనకు వేసవి సీజన్‌లో మామిడి పండ్లు అధికంగా లభిస్తాయన్న సంగతి తెలిసిందే. అందుకనే ఈ సీజన్‌లో చాలా మంది ఈ పండ్లను తినేందుకు ఆసక్తిని చూపిస్తుంటారు. మామిడి పండ్లు కూడా అనేక రకాల వెరైటీల్లో మనకు లభిస్తుంటాయి. అయితే మామిడి పండ్లను ఎక్కువగా తింటే వేడి చేస్తుందని చెబుతుంటారు. అలాగే ఈ పండ్లను అధికంగా తింటే బరువు పెరుగుతామని, షుగర్ వస్తుందని కూడా అంటారు. అయితే మామిడి పండ్లను అధికంగా తింటే వేడి చేయడం మాట నిజమే. కానీ ఈ పండ్లను తింటే బరువు పెరగరు. అలాగే షుగర్ ఉన్నవారు కూడా మోతాదులో ఈ పండ్లను తినవచ్చు. దీంతో ఎలాంటి నష్టం జరగదు.
ఇక మామిడి పండ్లలో కొలెస్ట్రాల్, ఉప్పు ఉండవు. పైగా వేసవిలో మన శరీరానికి కావల్సిన పోషకాలను మామిడి పండ్లు అందిస్తాయి. కనుక ఈ సీజన్‌లో మామిడి పండ్లను మిస్ చేయకుండా తినాల్సిందే. ఇక ఈ పండ్లను తినడం వల్ల నోట్లోని బాక్టీరియా నశిస్తుంది. దీంతో దంతాలు, చిగుళ్ల నొప్పులు, వాపులు తగ్గుతాయి. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే దంతాలు శుభ్రంగా మారుతాయి. దంతాలపై ఉండే ఎనామిల్ కూడా దృఢంగా మారుతుంది. మామిడి పండును మంచి జీర్ణకారి అని చెప్పవచ్చు. అంటే తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేస్తుందన్నమాట. అజీర్తి, అరుదుగల సరిగ్గా లేకపోవడం వంటి సమస్యలు ఉన్నవారు భోజనం చేసిన వెంటనే ఒక మామిడి పండును తినాలి. దీంతో ఆహారం సరిగ్గా జీర్ణమవువుతుంది. అజీర్తి తగ్గుతుంది.
మామిడి పండ్లలో ఐరన్ అధికంగా ఉంటుంది. అందువల్ల రక్తహీనత సమస్య ఉన్నవారు ఈ పండ్లను తింటే రక్తం బాగా వృద్ధి చెందుతుంది. అలాగే మామిడి పండ్లలో ఉండే కాపర్ ఎర్ర రక్త కణాలను వృద్ధి చేస్తుంది. అలాగే ఈ పండ్లలో ఉండే విటమిన్లు, మినరల్స్ గుండె జబ్బులు రాకుండా చూస్తాయి. చర్మం ఆరోగ్యాన్ని పెంచేందుకు మామడి పండ్లు ఉపయోగపడతాయి. ఈ పండ్లను తినడం వల్ల మెదడు కూడా యాక్టివ్ గా మారుతుంది. ఇక మామిడి పండ్ల గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పాలి. ఈ పండ్లను తినడం వల్ల శృంగార సామర్థ్యం పెరుగుతుంది. శృంగారంపై ఆసక్తి కోల్పోయిన వారు మామిడి పండ్లను తింటే ప్రయోజనం ఉంటుంది. ఇలా మామిడి పండ్లను తినడం వల్ల ఎన్నో లాభాలను పొందవచ్చు.