మనకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి. వీటి ధర ఎప్పుడూ తగ్గుతూ పెరుగుతూ ఉంటుంది. అయితే మనం ఏ కూరను కూడా టమాటాలు వేయకుండా పూర్తి చేయం. టమాటాలు కూరకు మంచి రుచిని అందిస్తాయి. అయితే రోజూ టమాటాలను తినడం వల్ల ఎన్నో అద్బుతమైన ప్రయోజనాలు కలుగుతాయని అంటున్నారు వైద్య నిపుణులు. కానీ టమాటాలను రోజూ తినడం ఎలా.. అని సందేహిస్తున్నారా.. అయితే అందుకు బదులుగా టమాటాలతో సూప్ తయారు చేసి తాగండి. దీంతో టమాటాలను తిన్న లాభాలను పొందవచ్చు.
రోజూ ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్‌లో భాగంగా టమాటా సూప్‌ను తాగితే అనేక ప్రయోజనాలను పొందవచ్చు. టమాటా సూప్ శరీరానికి శక్తిని అందిస్తుంది. ఉదయం ఈ సూప్‌ను తాగడం వల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు. చురుగ్గా పనిచేస్తారు. టమాటాల్లో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. ముఖ్యంగా దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే టమాటాల్లో ఉండే విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. కంటి చూపు మెరుగు పడుతుంది.
టమాటాలను తినడం వల్ల శరీరంలో పొటాషియం స్థాయిలు పెరుగుతాయి. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి కూడా టమాటాలు ఎంతో మేలు చేస్తాయి. దీంతో గ్యాస్, అసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాగే అజీర్తి తగ్గుతుంది. మలబద్దకం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇలా రోజూ టమాటా సూప్‌ను తాగితే ఎన్నో లాభాలను పొందవచ్చు.