Thyroid Foods : నేటి తరుణంలో మనలో చాలా మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. వయసుతో సంబంధం లేకుండా అందరూ ఈ సమస్య బారిన పడుతున్నారు. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్ల కారణంగా తలెత్తే అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటి. థైరాయిడ్ గ్రంథి గొంతు దగ్గర సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది. ది మన శరీరానికి అవసరమయ్యే హార్మోన్లను విడుదల చేస్తూ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి మన శరీరంలో కీలక పాత్ర పోషిస్తుంది. అయితే అస్థవ్యస్థమైన జీవన విధానం కారణంగా థైరాయిడ్ గ్రంథి పని తీరు దెబ్బతింటుంది. దీంతో ఈ గ్రంథి హార్మోన్లను సరిగ్గా ఉత్పత్తి చేయడం లేదు. దీని వల్ల హైపర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజం వంటి సమస్యల బారిన పడుతున్నారు. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారిలో జీవక్రియల రేటు తక్కువగా ఉంటుంది. అలాగే బరువు పెరగడం, జుట్టు రాలడం, మలబద్దకం వంటి సమస్యలు కూడా ఎదరవుతూ ఉంటాయి.
థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు తప్పకుండా మందులను వాడాల్సి ఉంటుంది. మందులను వాడడంతో పాటు కొన్ని ఆహార నియమాలను కూడా పాటించాలి. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు జంక్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును మరింత దెబ్బతీస్తాయి. తాజా పండ్లను, కూరగాయలను, ధాన్యాలను ఎక్కువగా తీసుకోవాలి. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు తీసుకోవాల్సిన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు తీసుకోవాల్సిన ఆహారాల్లో గుమ్మడి గింజలు కూడా ఒకటి. వీటిలో జింక్ అధికంగా ఉంటుంది. ఇది T4 హార్మోన్ ను క్రియాశీల T3 హార్మోన్ గా మార్చడంలో సహాయపడుతుంది. అలాగే కరివేపాకును కూడా అధికంగా తీసుకోవాలి. కరివేపాకులో కాపర్ అధికంగా ఉంటుంది. ఇది థైరాక్సిన్ హార్మోన్ T4 ఉత్పత్తిని పెంచడంతో పాటు శరీరంలో క్యాల్షియం స్థాయిలను అదుపులో ఉంచడం ద్వారా రక్తకణాలు T4 ను ఎక్కువగా శోషించకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.
అలాగే థైరాయిడ్ తో బాధపడే వారు సబ్జా గింజలను తీసుకోవాలి. వీటిలో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు థైరాయిడ్ గ్రంథి పని తీరును మెరుగుపరచడంతో పాటు శరీరంలో జీవక్రియల రేటును మెరుగుపరచడంలో కూడా దోహదపడతాయి. అలాగే తోటకూర కూడా థైరాయిడ్ వ్యాధి గ్రస్తులకు ఎంతో మేలు చేస్తుంది. దీనిలో అధికంగా ఉండే సెలీనియం T4 ను T3 గా మార్చడంలో దోహదపడుతుంది. అలాగే దానిమ్మకాయలను ఎక్కువగా తీసుకోవాలి. దీనిలో ఉండే ఫాలీఫినాల్స్ శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను తొలగించి థైరాయిడ్ గ్రంథిని కాపాడడంలో దోహదపడతాయి. అలాగే థైరాయిడ్ తో బాధపడే వారు పెరుగును అధికంగా తీసుకోవాలి.
పెరుగులో ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే దీనిలో ఐయోడిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ ఆహారాలను తీసుకోవడం వల్ల థైరాయిడ్ స్థాయిలు ఎల్లప్పుడూ అదుపులో ఉంటాయని అలాగే వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు.