Sorakaya Majjiga Charu : మనం సొరకాయతో రకరకాల వంటకాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. సొరకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చక్కటి ఆరోగ్యాన్ని అందించే కూరగాయల్లో ఇది ఒకటి. సొరకాయతో మనం ఎక్కువగా కూర, పప్పు, పులుసు, పచ్చడి వంటి తయారు చేస్తూ ఉంటాం. ఇవే కాకుండా సొరకాయతో మనం మజ్జిగ చారును కూడా తయారు చేసుకోవచ్చు. సొరకాయ మజ్జిగ చారు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా సమయం కూడా పట్టదు. అలాగే తయారు చేయడం కూడా చాలా తేలిక. రుచిగా, కమ్మగా ఆరోగ్యానికి మేలు చేసేలా సొరకాయతో మజ్జిగ చారును ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సొరకాయ మజ్జిగ చారు తయారీ విధానం..
సొరకాయ ముక్కలు – ఒక కప్పు, ఉప్పు – పావు టీ స్పూన్, నీళ్లు – పావు గ్లాస్, నూనె – ఒక టేబుల్ స్పూన్, తాళింపు దినుసులు – ఒక టేబుల్ స్పూన్, ఇంగువ – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, పసుపు – పావు టీ స్పూన్, చిలికిన పెరుగు – 200 గ్రా., తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
సొరకాయ మజ్జిగ చారు తయారీ విధానం..
ముందుగా కళాయిలో సొరకాయ ముక్కలు, ఉప్పు, నీళ్లు పోసి కలపాలి. వీటిపై మూతను ఉంచి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత సొరకాయ ముక్కలు, పసుపు వేసి కలపాలి. సొరకాయలో ఉండే నీరంతా పోయి ముక్కలు ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత పెరుగు, ఉప్పు తగినన్ని నీళ్లు పోసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే సొరకాయ మజ్జిగ చారు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే రుచిగా ఉండడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వేసవికాలంలో ఇలా సొరకాయతో మజ్జిగ చారును తయారు చేసుకుని తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.