Snake Bite : ఈ భూమి మీద మానవులతోపాటు అనేక రకాల జీవ జాతులు కూడా ఉన్నాయి. వాటిల్లో పాము కూడా ఒకటి. పామును చూడగానే చాలా మంది భయపడిపోతుంటారు. కానీ అవి తమను రక్షించుకోవడానికే మాత్రమే ఎదుటి వారి మీద దాడి చేస్తాయి. మనకు కనిపించే పాములన్నీ విష పూరితం కావు. విషరహిత పాములు కూడా ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. పాము కాటుకు గురి అయ్యామన్న భయంతోనే చాలా మంది మరణిస్తున్నారని నివేధికలు చెబుతున్నాయి. డబ్ల్యూహెచ్ఓ నివేదిక ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు యాభై లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారని తెలుస్తోంది. మన దేశంలో ఈ సంఖ్య 2 లక్షల వరకు ఉంటుందని గణంకాలు తెలియజేస్తున్నాయి.
అలాగే మన దేశంలో దాదాపు 250 జాతుల పాములు ఉన్నాయి. వాటిల్లో 52 జాతులు విషాన్ని కలిగి ఉండే పాములు అని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో కనిపించే పాముల్లో 5 రకాల పాములు విషపూరితమైనవి. పాము కరిచిన వెంటనే తీసుకోవల్సిన జాగ్రత్తల గురించి, అలాగే పాము కరిచిన వెంటనే చేయవలసిన ప్రథమ చికిత్స గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పాము కరిచిన వెంటనే అది ఎటువంటి పాము అని గుర్తించాలి. కాటు వేసిన చోట రెండు చుక్కలు ఉంటే అది విషపూరిత పాముగా గుర్తించాలి. మనకు ఎక్కువగా త్రాచు పాము, కట్ల పాము, రక్త పింజర వంటి విష సర్పాలు కనిపిస్తాయి. ఇవి కాటు వేసిన వెంటనే విషం నరాల్లోకి ప్రవేశిస్తుంది. ఆ తరువాత తల తిరగడం, నోటి వెంట నురుగు రావడం, కంటి చూపు మందగించడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి.
రక్త పింజర పాము కాటు వేసిన చోట 5 నుండి 10 నిమిషాల వరకు రక్తం కారుతూనే ఉంటుంది. పంటి చిగుళ్ల ఉండి రక్తం కారడం, మూత్రం ఎర్రగా రావడం, కాళ్లు వాపులకు గురి కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. పాము తోక చూసి కూడా మనం అది ఎటువంటి పాము అని తెలుసుకోవచ్చు. విష సర్పాలకు తోక మొనదేలి ఉంటుంది. విష రహిత పాములకు తోక గుండ్రంగా ఉంటుంది. పాము కాటు వేసిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా కరిచిన మూడు గంటల్లోపు చికిత్స చేయించుకుంటే ప్రాణాపాయం నుండి బయటపడవచ్చు.
పాము కరిచిన వ్యక్తికి ముందుగా ధైర్యం చెప్పాలి. వారిని ఎక్కువ దూరం నడిపించకూదు. నడవడం వల్ల విషం త్వరగా శరీరం మొత్తం వ్యాపిస్తుంది. కాటు వేసిన చోట రక్తప్రసరణ జరగకుండా కట్టు కట్టకూడదు. కాటు వేసిన చోట గాటు పెట్టి రక్తాన్ని తీయడానికి ప్రయత్నించకూడదు. పామ కాటు వేసిన చోట నోటితో విషాన్ని తీయడానికి ప్రయత్నించకూడదు. పాము కాటు వేసిన చోట శుభ్రమైన నీటితో లేదా సెలైన్ నీటితో శుభ్రంగా కడగాలి. ఇలా చేయడం వల్ల ఆ ప్రాంతంలో ఉన్న విషం పోతుంది. పాము లాలాజలంలో ధనుర్వాతాన్ని కలిగించే క్రిములు ఉంటాయి. కనుక ముందు ధనుర్వాతం రాకుండా టీటీ ఇన్ జెంక్షన్ ను ఇప్పించాలి.
పాము కాటుకు గురి అయిన వారికి తాగడానికి, తినడానికి ఏమి ఇవ్వకూడదు. పాములు ఎక్కువగా ఎలుకలను తినడానికి ఎలుక బొరియల వద్దకు వస్తాయి. పొలం గట్ల మీద నడిచే వారు కాళ్లతో, చెప్పలతో శబ్దం చేసుకుంటూ నడవాలి. అలాగే చేతిలో కర్ర, కండువాను పట్టుకుని నడవాలి. ఇలా శబ్దం చేస్తూ నడవడం వల్ల పాము భయంతో మన దగ్గరికి రాకుండా ఉంటుంది. ఒకవేళ పాము పడగ విప్పి కదలనీయకుండా చేసినప్పుడు భుజం మీద ఉండే కండువాను పాము పైకి విసరాలి. ఇలా చేయడం వల్ల పాము కండువాను కాటు వేస్తుంది. ఆ సమయంలో మనం సురక్షిత ప్రాంతానికి వెళ్లాలి.
పాము కరిచిన వెంటనే నాటు వైద్యం చేసుకుని అశ్రద్ధ చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. వర్షాకాలంలో పాములు ఎక్కువగా సంచరించే అవకాశం ఉంటుంది. కనుక పాము కాటుకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ పాటు కాటు వేస్తే అధైర్యపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల పాముకాటు ప్రాణాంతకం కాకుండా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు.