Wheat Rava Upma : మనలో చాలా మంది గోధుమ పిండితో తయారు చేసిన చపాతీలను తింటుంటారు. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అధిక బరువును తగ్గిస్తాయి. షుగర్, కొలెస్ట్రాల్ లెవల్స్‌ను అదుపులో ఉంచేందుకు సహాయం చేస్తాయి. ఇంకా గోధుమ పిండి చపాతీలను తినడం వల్ల ఎన్నో లాభాలు కలుగుతాయి. అయితే గోధుమలతో రవ్వను తయారు చేసి దాంతో ఉప్మాను చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. పైగా మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఇక గోధుమ రవ్వ ఉప్మాను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోధుమ రవ్వ ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమ రవ్వ – ఒక కప్పు, జీలకర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – రుచికి సరిపడా, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చి మిర్చి – 2, తరిగిన టమాటాలు – 2, కరివేపాకు – ఒక రెబ్బ, తరిగిన పుదీనా – కొద్దిగా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన అల్లం ముక్కలు – కొద్దిగా, నూనె – 2 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 3 కప్పులు.
గోధుమ రవ్వ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నెయ్యిని వేసి కాగాక చిన్న మంటపై గోధుమ రవ్వ ను వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి కాగాక పల్లీలు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించుకోవాలి. తరువాత తరిగిన అల్లం, ఉల్లిపాయ, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక టమాట ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు, తరిగిన కొత్తిమీర, పుదీనా వేసి కలిపి నీరు పూర్తిగా మరిగే వరకు ఉంచాలి. నీరు పూర్తిగా మరిగిన తరువాత వేయించి పెట్టుకున్న గోదుమ రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా చూసుకోవాలి. ఇప్పుడు గోధుమ రవ్వ పూర్తిగా ఉడికే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, పొడి పొడిగా ఉండే గోధుమ రవ్వ ఉప్మా తయారవుతుంది. దీనిని టమాట చట్నీ, పుట్నాల కారంతో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.