Palakura Pachadi : పోష‌కాల‌ను అందించే పాల‌కూర‌.. దీంతో ప‌చ్చ‌డి త‌యారీ ఇలా..!

Palakura Pachadi : మ‌న శ‌రీరానికి ఆకు కూర‌లు ఎంతో మేలు చేస్తాయి. మ‌నం ఆహారంగా తీసుకునే ఆకు కూర‌ల‌లో పాల‌కూర ఒక‌టి. పాల‌కూర‌ను త‌ర‌చూ ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల అజీర్తి త‌గ్గుతుంది. పాల‌కూర‌లో పోష‌కాలు అధికంగా, క్యాల‌రీలు త‌క్కువ‌గా ఉంటాయి. పాల‌కూరలో యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలు అధికంగా ఉంటాయి. అందువ‌ల్ల కీళ్ల నొప్పులు ఉన్న‌వారికి ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇక పాల‌కూర‌తో మ‌నం ప‌ప్పు, కూర ఎక్కువ‌గా చేస్తుంటాం. కానీ దీంతో ప‌చ్చ‌డిని కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఇది ఎంతో రుచిగా ఉండ‌డ‌మే కాదు.. మ‌న‌కు పోష‌కాల‌ను కూడా అందిస్తుంది. ఇక పాల‌కూర ప‌చ్చ‌డిని ఎలా త‌యారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

Palakura Pachadi very easy to make nutritious
Palakura Pachadi

పాల‌కూర ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన పాల‌కూర – ఒక క‌ట్ట (పెద్ద‌ది), శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, జీలక‌ర్ర – అర టేబుల్ స్పూన్, ధ‌నియాలు – అర టేబుల్ స్పూన్, మిన‌ప ప‌ప్పు – ఒక టేబుల్ స్పూన్, త‌రిగిన ఉల్లిపాయ – ఒక‌టి, ప‌చ్చి మిర‌ప‌కాయ‌లు – 8, నూనె -2 టేబుల్ స్పూన్స్, చింత‌పండు – కొద్దిగా.

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, క‌రివేపాకు – ఒక రెబ్బ‌, ఎండు మిర్చి – 2, ప‌సుపు – పావు టీ స్పూన్, క‌చ్చాప‌చ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలు – 6, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్.

పాల‌కూర ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా ఒక క‌ళాయిలో నూనె వేసి శ‌న‌గ‌ప‌ప్పు, మిన‌ప ప‌ప్పు, ధ‌నియాలు, జీల‌క‌ర్ర వేసి వేయించుకోవాలి. త‌రువాత అందులో ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల‌ను కూడా వేసి వేయించుకోవాలి. ఇవి వేగాక ఒక ప్లేట్ లోకి తీసుకుని ప‌క్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే క‌ళాయిలో మ‌రో టేబుల్ స్పూన్ ను వేసి త‌రిగిన పాల‌కూరను వేసి వేయించుకోవాలి. పాల‌కూర పూర్తిగా ఉడికిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి పాల‌కూర‌ను చ‌ల్లారనివ్వాలి.

త‌రువాత ఒక జార్ లో ముందుగా వేయించి పెట్టుకున్న ప‌చ్చి మిర‌ప‌కాయ‌ల మిశ్ర‌మాన్ని వేసి క‌చ్చా ప‌చ్చాగా మిక్సీ ప‌ట్టుకోవాలి. త‌రువాత ఉడికించిన పాల‌కూర‌, రుచికి స‌రిప‌డా ఉప్పు, కొద్దిగా చింత‌పండును వేసి మ‌రోసారి మిక్సీ ప‌ట్టుకోవాలి. ఈ మిశ్ర‌మాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి కాగాక తాళింపు ప‌దార్థాల‌ను వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపును మిక్సీ పట్టుకున్న పాల‌కూర మిశ్ర‌మంలో వేసి క‌లుపుకోవాలి. త‌రువాత త‌రిగిన ఉల్లిపాయ‌ల‌ను వేసి క‌లుపుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే పాల‌కూర ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీన్ని అన్నం లేదా చ‌పాతీల్లో తింటే భ‌లే రుచిగా ఉంటుంది. పైగా పాల‌కూర‌లో ఉండే పోష‌కాలు మ‌న‌కు ల‌భిస్తాయి. క‌నుక పాల‌కూర‌ను ఇలా కూడా తిన‌వ‌చ్చు. దీంతో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు.

D

Recent Posts