సాధారణంగా ఏడాదిలో సీజనల్‌గా వచ్చే వ్యాధులు కొన్ని ఉంటాయి. కానీ దోమలు మాత్రం మనకు ఏడాది పొడవునా ఇబ్బందులను కలిగిస్తూనే ఉంటాయి. దోమలు విపరీతంగా పెరిగిపోయి మనల్ని కుడుతూ మనకు అనారోగ్య సమస్యలను తెచ్చి పెడతాయి. దోమలను నివారించేందుకు చాలా మంది రకరకాల పద్ధతులను పాటిస్తుంటారు. అయితే కింద తెలిపిన సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల దోమల్ని మన దరికి చేరకుండా చూసుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మార్కెట్‌లో మనకు లెమన్ యూకలిప్టస్ ఆయిల్ అని లభిస్తుంది. దీన్ని శరీరానికి రాసుకోవడం ద్వారా దోమల నుంచి రక్షణ లభిస్తుంది. ఈ ఆయిల్ మనకు సుమారుగా 7 గంటల పాటు రక్షణను అందిస్తుంది. దోమలను మన దగ్గరకు రానివ్వదు. దీంతో సురక్షితంగా ఉండవచ్చు.
విటమిన్ బి1 ఎక్కువగా ఉండే కోడిగుడ్లు, చేపలు, పచ్చి బఠానీలు, గోధుమలు, స్ట్రాబెర్రీలు, పొద్దు తిరుగుడు విత్తనాలు, బ్లాక్ బీన్స్, పప్పు దినుసులు, సోయాబీన్ తదితర ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా దోమల నుంచి మనకు రక్షణ లభిస్తుంది.
సిట్రొనెల్లా క్యాండిల్స్‌ను ఇంట్లో వెలిగించడం వల్ల వాటి నుంచి వచ్చే వాసనకు దోమలు ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే సిట్రొనెల్లా ఆయిల్‌ను కూడా ఉపయోగించవచ్చు. దీన్ని శరీరానికి రాస్తే ఆ వాసనకు దోమలు రాకుండా ఉంటాయి.
కొద్దిగా ఆలివ్ ఆయిల్, లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్‌లను తీసుకుని బాగా కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి రాసుకోవాలి. దీని వల్ల కూడా దోమలు మనల్ని కుట్టకుండా ఉంటాయి.
నిత్యం వెల్లుల్లిని తినడం వల్ల లేదా వెల్లుల్లి ఆయిల్, లోషన్‌లను రాసుకోవడం వల్ల లేదా వెల్లుల్లి స్ప్రేను వాడడం వల్ల దోమలు మన దగ్గరికి రాకుండా ఉంటాయి. వెల్లుల్లి నుంచి వాసన దోమలకు పడదు. అందువల్ల అవి మన దగ్గరకు రావు.
వేప నూనెను శరీరానికి రాసుకోవడం వల్ల కూడా దోమల నుంచి రక్షణ లభిస్తుంది. దోమలు మన దగ్గరకు రాకుండా ఉంటాయి.