Nausea : వికారం అనేది మనలో చాలా మందికి వచ్చే అనారోగ్య సమస్యల్లో ఒకటి. ఇది వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. తిన్న ఆహారం పడకపోవడం లేదా సరిగ్గా జీర్ణం కాకపోవడం, డీహైడ్రేషన్ బారిన పడడం, నీరసం, ప్రయాణాలు చేయడం.. వంటి అనేక కారణాల వల్ల వికారం కలుగుతుంటుంది. దీంతో తల తిప్పినట్లు ఉంటుంది. వాంతికి వచ్చినట్లు అనిపిస్తుంది. అయితే వికారం నుంచి బయట పడేందుకు ఇంగ్లిష్ మెడిసిన్ అవసరం లేదు. కింద తెలిపిన పలు సహజ సిద్ధమైన చిట్కాలను పాటిస్తే చాలు.. వికారం నుంచి ఉపశమనం కలుగుతుంది. మరి ఆ చిట్కాలు ఏమిటంటే..
నిమ్మకాయను సగానికి కోసి దాన్ని కొద్దిగా నలిపి వాసన చూస్తుండాలి. దీంతో వికారం తగ్గుతుంది. లేదా ప్రతి 5, 10 నిమిషాలకు నాలుగైదు చుక్కల నిమ్మరసాన్ని నోట్లో వేసుకుని మింగాలి. ఇలా చేసినా వికారం తగ్గుతుంది. వికారం కలుగుతుంటే.. చాలా సుదీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. బాగా గట్టిగా ఊపిరి పీల్చి నెమ్మదిగా వదులుతుండాలి. ఇలా చేయడం వల్ల వికారం కొంత కొంతగా తగ్గుతుంది. పుదీనా రసాన్ని 1 టీస్పూన్ తాగినా లేదంటే.. పుదీనా ఆకులను వాసన చూసినా వికారం నుంచి బయట పడవచ్చు.
బాదంపప్పు, కోడిగుడ్లు, పాలను తీసుకుంటే వికారం అనిపించదు. దాల్చిన చెక్క పొడిని చిటికెడు తీసుకుని అలాగే నమిలి మింగినా, లేదంటే అందులో కొద్దిగా తేనె కలుపుకుని మింగినా వికారం సమస్య నుంచి బయట పడవచ్చు. కొన్ని సార్లు డీహైడ్రేషన్ వల్ల కూడా వికారంగా అనిపిస్తుంది. అలాంటప్పుడు దాహం తీరేవరకు లేదా ప్రతి 5, 10 నిమిషాలకు కొద్ది కొద్దిగా నీటిని తాగుతుండాలి. దీంతో వికారం తగ్గుతుంది. వికారం సమస్య ఉన్నవారు కారం తగ్గించాలి. కారం ఎక్కువగా తిన్నా జీర్ణాశయంలో ఇబ్బంది కలుగుతుంది. ఫలితంగా వికారం వస్తుంది.
కొందరు తిన్న వెంటనే పడుకుంటారు. అలా చేయరాదు. కనీసం 30 నిమిషాల పాటు అయినా సరే కూర్చుని ఉండాలి. దీంతో వికారం రాకుండా ఉంటుంది. వికారం వస్తుంటే అలా బయటకు వెళ్లి కొద్దిగా చల్లగాలిలో, ప్రకృతిలో తిరగాలి. సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.