Cloves : మనం వంటల్లో అనేక రకాల మసాలా దినుసులను వాడుతూ ఉంటాం. మనం విరివిరిగా ఉపయోగించే మపాలా దినుసుల్లో లవంగాలు ఒకటి. లవంగాలు తెలియని వారు ఉండరనే చెప్పవచ్చు. ఇవి చక్కటి వాసనతో ఘాటు రుచిని కలిగి ఉంటాయి. లవంగాలు వేసి చేసే వంటలు చాలా రుచిగా ఉంటాయి. వంటల రుచిని పెంచడంతో పాటు మన ఆరోగ్యానికి మేలు చేయడంలో కూడా ఈ లవంగాలు మనకు ఎంతగానో సహాపపడతాయి. లవంగం చెట్టు మొగ్గలను కోసి ఎండబెట్టగా వచ్చిన మొగ్గలే ఈ లవంగాలు. పిట్ట కొంచెం కూత ఘనంలాగా లవంగాలు చిన్నవే అయినప్పటికి ఇవి మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. లవంగాలను ఉపయోగించడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. లవంగాలను తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వారిలో వీర్య కణాల సంఖ్య పెరగడంతో పాటు వీర్య కణాల చలనం కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే లవంగాలను నోట్లో వేసుకుని చప్పరించడం వల్ల నోటి దుర్వాసన సమస్య తగ్గుతుంది. అలాగే దంతాల నొప్పులు, చిగుళ్ల నుండి రక్తకారడం, పిప్పి పళ్లు వంటి సమస్యలు తగ్గుతాయి. నోటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదే విధంగా శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచి వైరస్, బ్యాక్టీరియాల దాడి నుండి మనల్ని కాపాడడంలో కూడా లవంగాలు మనకు సహాయపడతాయి. లవంగాలను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల జీర్ణ శక్తి మెరుగుపడుతుంది. గ్యాస్, అజీర్తి, ప్రేగుల్లో పుండ్లు, ఛాతిలో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుతాయి. ఈ లవంగాల నుండి లవంగం నూనెను కూడా తయారు చేస్తారు. ఈ నూనెను తలకు పట్టించడం వల్ల కుదుళ్లు బలంగా తయారవుతాయి. చుండ్రు సమస్య తగ్గుతుంది. జుట్టు నల్లగా, ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.
అదే విధంగా థైరాయిడ్ సమస్యతో బాధపడే వారు ఎక్కువగా అధిక బరువు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు. అలాంటి వారు లవంగాలను ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల అధిక బరువు సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. అదే విధంగా మానసిక ఒత్తిడి, ఆందోళన కారణంగా వచ్చే సమస్యల్లో తలనొప్పి కూడా ఒకటి. ఈ సమస్య తలెత్తగానే చాలా మంది కాఫీ, టీ లను తాగుతూ ఉంటారు. కాఫీ, టీ లను తాగడానికి బదులుగా లవంగాలను నోట్లో వేసుకుని చప్పరిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిని ఆహారంగా భాగంగా తీసుకోవడం వల్ల తలనొప్పి సమస్యే రాకుండా ఉంటుందని నిపుణులు తెలియజేస్తున్నారు. టైప్ 2 మధుమేహం సమస్యతో బాధపడే వారు ఈ లవంగాలను ఉపయోగించడం వల్ల చక్కటి ప్రయోజనాలు చేకూరుతాయి.
లవంగాలను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. అదే విధంగా కాలేయ పనితీరును మెరుగుపరిచి కామెర్ల వ్యాధిని తగ్గిచండంలో కూడా లవంగాలు మనకు సహాయపడతాయి. గొంతు నొప్పి, గొంతులో గరగర, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, సైనస్, ఆస్థమా, దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడంలో కూడా లవంగాలు దోహదపడతాయి. లవంగాలను కేవలం మసాలా దినుసుగా మాత్రమే చూడకుండా దీనిని ఒక గొప్ప ఔషధంగా కూడా చూడాలని నిపుణులు చెబుతున్నారు. లవంగాలను ఉపయోగించడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తగ్గడంతో పాటు భవిష్యత్తులో రాకుండా ఉంటాయని వారు తెలియజేస్తున్నారు.