Kandi Kattu : కంది క‌ట్టు త‌యారీ ఇలా.. ఎంతో రుచిక‌రం, ఆరోగ్య‌క‌రం..

Kandi Kattu : కందిప‌ప్పుతో మ‌నం ఎక్కువ‌గా ప‌ప్పు చారు, ర‌సం వంటి వాటినే త‌యారు చేస్తూ ఉంటాం. కందిప‌ప్పుతో చేసే ఈ వంట‌కాలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఇవే కాకుండా కందిప‌ప్పుతో మ‌నం ఎంతో రుచిగా ఉండే కంది క‌ట్టును కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. కంది క‌ట్టు కూడా చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. బ్యాచిల‌ర్స్, వంట‌రాని వారు కూడా దీనిని తేలిక‌గా త‌యారు చేసుకోవ‌చ్చు. కేవ‌లం నిమిషాల వ్య‌వ‌ధిలోనే త‌యారయ్యే ఈ కందిక‌ట్టును ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

కంది క‌ట్టు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – ఒక టీ గ్లాస్, అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్, ప‌సుపు – పావు టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నిమ్మ‌కాయ – 1.

Kandi Kattu  recipe in telugu very healthy and tasty
Kandi Kattu

తాళింపు త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 6, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 4, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

కంది క‌ట్టు త‌యారీ విధానం..
ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును తీసుకుని శుభ్రంగా క‌డ‌గాలి. త‌రువాత త‌గినన్ని నీళ్లు పోసుకోవాలి. ఇందులోనే పసుపు, అల్లం ముక్క‌లు వేసి మూత పెట్టాలి. ఈ ప‌ప్పును 4 నుండి 5 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు మెత్త‌గా ఉడికించుకోవాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకోవాలి. త‌రువాత ఉప్పు, త‌గిన‌న్ని నీళ్లు పోసి క‌ల‌పాలి. కంది క‌ట్టు మ‌రీ చిక్క‌గా, మ‌రీ ప‌లుచ‌గా కాకుండా చూసుకోవాలి. త‌రువాత దీనిని స్ట‌వ్ మీద ఉంచి పొంగు వ‌చ్చే వ‌ర‌కు బాగా మ‌రిగించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక తాళింపు ప‌దార్థాలు ఒక్కొక్క‌టిగా వేసి వేయించాలి. తాళింపు చ‌క్క‌గా వేగిన త‌రువాత ముందుగా త‌యారు చేసుకున్న కంది క‌ట్టును వేసి క‌ల‌పాలి.

దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కంది క‌ట్టు కొద్దిగా చ‌ల్లారిన త‌రువాత రుచికి త‌గిన‌ట్టు నిమ్మ‌ర‌సాన్ని వేసి క‌ల‌పాలి. ఈ విధంగా త‌యారు చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే కందిక‌ట్టు త‌యారవుతుంది. దీనిని అన్నం, ఇడ్లీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. కందిప‌ప్పుతో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు అప్పుడ‌ప్పుడూ ఇలా కందిక‌ట్టును కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. వంట చేయ‌డానికి ఎక్కువ‌గా స‌మ‌యం లేన‌ప్పుడు ఇలా కంది క‌ట్టును త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. దీనిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts