Nausea : జ్వరం వచ్చిన వారిలో చాలా మందికి వికారంగా ఉండడం సహజం. అలాగే కొందరికి జ్వరం లేకపోయినా ఉదయం నుంచే వికారంగా అనిపిస్తుంటుంది. వాంతికి వచ్చినట్లు ఉంటుంది. కానీ వాంతికి అవదు. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. కారణాలు ఏమున్నప్పటికీ వికారం ఉంటే మాత్రం అసలు ఏమీ తినాలని, తాగాలని అనిపించదు. అయితే కింద తెలిపిన పలు సహజసిద్ధమైన చిట్కాలను పాటించడం వల్ల వికారం నుంచి బయట పడవచ్చు. మరి అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!
గడ్డి చామంతి పూలలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉంటాయి. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వ్యాధులను తగ్గిస్తాయి. గడ్డి చామంతి పూలతో చేసిన టీలో కాస్త తేనె కలిపి తాగడం వల్ల వికారం నుంచి త్వరగా బయట పడవచ్చు. ఆకలి బాగా అవుతుంది. అజీర్ణం తగ్గుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం నుంచి కూడా ఉశమనం లభిస్తుంది. ఈ టీని రోజుకు రెండు సార్లు తాగాలి.
పూటకు ఒక లవంగం చొప్పున నోట్లో వేసుకుని నమిలి తింటున్నా కూడా వికారం నుంచి బయట పడవచ్చు. లవంగాల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వికారం సమస్యను తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. కనుక లవంగాలను తింటే ప్రయోజనం కలుగుతుంది. అలాగే పుదీనా, యాలకులు, అల్లం వేసి మరిగించిన టీని తాగడం వల్ల కూడా వికారం నుంచి బయట పడవచ్చు. దీంతో జ్వరంగా కూడా త్వరగా తగ్గుతుంది. ముఖ్యంగా మలేరియా, డెంగ్యూ వంటి జ్వరాలు వచ్చిన వారు ఈ టీని తాగితే త్వరగా కోలుకుంటారు. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
ఇక వికారం సమస్య ఉన్నవారు తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారాలను తీసుకోవాలి. అలాగే తక్కువ మొత్తంలో ఆహారాన్ని ఎక్కువ సార్లు తినాలి. దీంతోపాటు విటమిన్ సి ఉన్న పండ్లను తింటే వికారం తగ్గుతుంది. ఇలా చిట్కాలను పాటిస్తూ ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వికారం నుంచి సులభంగా బయట పడతారు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.