Veg Fried Rice : బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో, రెస్టారెంట్లలో మనకు చైనీస్ ఫుడ్ ఐటమ్స్ లభిస్తుంటాయి. వాటిల్లో వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. చికెన్, ఎగ్ లతో ఫ్రైడ్ రైస్ తినలేని వారు వెజ్ ఫ్రైడ్ రైస్‌ను ఇష్టంగా తింటారు. అయితే బయట లభించే మాదిరిగానే రుచి వచ్చేలా మనం ఇంట్లోనే వెజ్ ఫ్రైడ్ రైస్‌ను సులభంగా తయారు చేయవచ్చు. దీన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
వెజ్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు..
అన్నం – 2 కప్పులు, అల్లం ముక్కలు – 1 టేబుల్ స్పూన్, ఉల్లిగడ్డ – 1, క్యాప్సికమ్ – అర కప్పు, క్యారెట్ – అర కప్పు, క్యాబేజ్ – అర కప్పు, కార్న్ – 2 టేబుల్ స్పూన్లు, వెనిగర్ – 2 టేబుల్ స్పూన్లు, సోయాసాస్ – 2 టీస్పూన్లు, బ్లాక్ పెప్పర్ – అర టీస్పూన్, ఉల్లికాడలు – టీ స్పూన్, ఉప్పు, నూనె – తగినంత.
వెజ్ ఫ్రైడ్ రైస్ ను తయారు చేసే విధానం..
కడాయిలో నూనె వేసి వేడి చేయాలి. ఆ తర్వాత కట్‌చేసి పెట్టుకున్న అల్లం, ఉల్లిముక్కలు వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత క్యాప్సికమ్, క్యారెట్, కార్న్ ముక్కలు కూడా వేసి ఐదు నిమిషాల పాటు వేయించాలి. మిశ్రమం దగ్గర పడేంత వరకు వేయించాలి. అందులో క్యాబేజ్ ముక్కలు వేసి కలుపాలి. బాగా వేగిన తర్వాత వెనిగర్, సోయాసాస్, ఉప్పు వేసి కలపాలి. ముందుగా తయారు చేసిన అన్నాన్ని మిశ్రమంలో వేసి కలపాలి. బ్లాక్‌పెప్పర్, ఉల్లికాడల ముక్కలు వేసి నిమిషంపాటు వేడి చేయాలి. ఇక అంతే కావలసిన వెజ్ ఫ్రైడ్‌రైస్ రెడీ. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.