Lice : తలలో పేల సమస్యతో బాధపడే వారు మనలో ఉండే ఉంటారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా పేలు అందరిని బాధిస్తూ ఉంటాయి. ఇవి తలలో చేరి మనకు దురదను, చికాకును కలిగిస్తూ ఉంటాయి. ఇవి మన శరీరానికి బయట ఉండి జీవిస్తాయి కనుక వీటిని బాహ్య పరాన్న జీవులు అని అంటారు. పేలను తొలగించుకోవడానికి ప్రత్యేక దువ్వెనలు కూడా ఉంటాయి. ఈ దువ్వెనలతో దువ్వి పేలను కుక్కి చంపేస్తూ ఉంటారు. కానీ ఒక్కోసారి చిన్న పరిమాణంలో ఉండే పేలను తొలగించడం ఈ దువ్వెనతో సాధ్యం కాదు. అలాగే పేలు ఎక్కువ సంఖ్యలో ఉన్నా కూడా దువ్వెనతో తొలగించడం కష్టం అవుతుంది. ఈ పేలను శాశ్వతంగా తొలగించే కొన్ని మార్గాలు ఉన్నాయి. పేలను నివారించే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పేలు రెక్కలు లేని రక్తాహార కీటకాలు. పేలు ముఖ భాగాన్ని గుచ్చి రక్తాన్ని పీల్చే కీటక జాతికి చెందినవి. వీటికి మూడు జతల కాళ్లు ఉంటాయి. కాళ్ల చివర నఖాలు వంపు తిరిగి ఉంటూ తలలోని వెంట్రుకలను, తల చర్మాన్ని పట్టుకోవడానికి ఉపయోగపడతాయి. ఆడ పేలు 80 నుండి 100 అండాలను విడుదల చేస్తూ వాటిని వెంట్రుకలకు అట్టిపెట్టుకున్నేట్టు చేస్తాయి. అండాలు తెల్లగా ఉంటాయి. అండాల నుండి నేరుగా వారంలో పిల్ల పేలు పుడతాయి. ఇవి మూడు సార్లు నిర్మోచనాలు జరుపుకొని ఫ్రౌడ జీవులుగా ఏర్పడతాయి. పేలు ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందుతాయి. పేల నుండి ఉపశమనాన్ని పొందడానికి మనకు మార్కెట్ లో అనేక రకాల షాంపులు లభ్యమవుతున్నాయి. కానీ అవి రసాయనాలతో తయారు చేయబడినవి.
అలా కాకుండా సహజ సిద్ద పదార్థాలతో కూడా పేల నుండి విముక్తిని పొందవచ్చు. దీని కోసం ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల వెనిగర్ ను తీసుకుని అందులో అంతే మోతాదులో నీటిని వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని తలకు రాసి ఆరనివ్వాలి. సరిగ్గా గంట తరువాత కుంకుడుకాయ రసంతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల పేల బాధ నుండి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఒక కప్పు కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ కర్పూరం బిళ్లలను వేసి కరిగిపోయే వరకు నూనెను వెచ్చబెట్టాలి. ఈ నూనె గోరు వెచ్చగా అయిన తరువాత దానిని తలకు రాసి మాడుకు అంటేలా బాగా మర్దనా చేయాలి. ఒక గంట తరువాత కుంకుడు కాయ రసంతో తలస్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
అదే విధంగా గుప్పెడు తులసి ఆకులను మెత్తగా నూరి రాత్రి పడుకునే ముందు తలకు అంటేలా బాగా రాసుకోవాలి. తరువాత వెంట్రుకలు కనబడకుండా తలకు టవల్ ను లేదా మరో వస్త్రాన్ని కట్టుకుని పట్టుకోవాలి. ఉదయం లేచిన తరువాత పేల దువ్వెనతో దువ్వుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా పేల బాధ తగ్గుతుంది. అలాగే ఆలివ్ నూనెను తలకు రాసి వెంట్రుకలకు షవర్ క్యాప్ పెట్టుకుని పడుకోవాలి. ఉదయం లేచిన తరువాత పేల దువ్వెనతో దువ్వుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే పేల బాధ నుండి విముక్తి పొందవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల పేల బాధ నుండి శాశ్వత పరిష్కారం కలుగుతుంది.