Indigestion Remedies : చలికాలంలో మనకు సహజంగానే దగ్గు, జలుబు వంటి శ్వాసకోశ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఊపిరి పీల్చడం కష్టంగా ఉంటుంది. అలాగే చలికాలంలో మనకు జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా అజీర్ణం ఇబ్బందులకు గురి చేస్తుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. దీంతో విరేచనాలు వస్తాయి. అలాగే మలబద్దకం కూడా ఉంటుంది. గ్యాస్ సమస్యల ఇబ్బందులు పెడుతుంది. అయితే కింద తెలిపిన చిట్కాలను పాటిస్తే ఈ సమస్యలన్నింటినీ ఒకేసారి తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
అజీర్ణం, గ్యాస్, మలబద్దకం సమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారు ఉసిరికాయ జ్యూస్‌ను తాగవచ్చు. ఉదయం పరగడుపునే 20 ఎంఎల్ ఉసిరికాయ జ్యూస్‌ను తీసుకుని దానికి అంతే మోతాదులో నీళ్లను కలిపి తాగాలి. ఇలా రోజూ చేస్తుంటే ఎలాంటి జీర్ణ సమస్య అయినా సరే తగ్గుతుంది. గ్యాస్ నుంచి ఉపశమనం లభిస్తుంది. మలబద్దకం ఉండదు. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. అలాగే ఈ సమస్యలను తగ్గించడంలో కలబంద రసం కూడా పనిచేస్తుంది. ఉదయం పరగడుపునే పావు కప్పు కలబంద రసంలో అర కప్పు నీళ్లను కలిపి తాగాలి. ఇలా చేస్తున్నా కూడా జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
తీవ్రమైన మలబద్దకం, గ్యాస్, అజీర్ణం, కడుపులో మంట ఉన్నవారు ఉదయాన్నే పరగడుపునే ఒక గ్లాస్ మజ్జిగను సేవించాలి. దీనివల్ల జీర్ణాశయం మొత్తం శుభ్రమవుతుంది. ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే రోజూ రాత్రి నిద్రకు ముందు ఒక టీస్పూన్ త్రిఫల చూర్ణాన్ని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కలిపి తీసుకోవాలి. ఇది కూడా జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. మలబద్దకం నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ చిట్కాలను పాటించడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడమే కాదు.. జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు రావు.