Chicken Noodles : నూడుల్స్ అంటే సాధారణంగా చాలా మందికి ఇష్టమే. అందుకనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల వైపు తరచూ పరుగులు పెడుతుంటారు. ఎగ్ నూడుల్స్, వెజ్, చికెన్.. ఇలా రకరకాల నూడుల్స్‌ను తింటుంటారు. అయితే వాస్తవానికి బయటి ఫుడ్‌ను తినడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందువల్ల ఏది తిన్నా ఇంట్లో చేసుకుంది అయితేనే బాగుంటుంది. ఎలాంటి హాని కలగకుండా ఉంటుంది. మరి నూడుల్స్‌ను తినడం ఎలా.. అంటే.. ఇంట్లోనే చికెన్ నూడుల్స్‌ను ఎంతో సులభంగా చేసుకోవచ్చు. కాస్త శ్రమిస్తే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తినేలాంటి నూడుల్స్ ఇంట్లోనే రెడీ అవుతాయి. వీటిని చేయడం కూడా సులభమే. చికెన్ నూడుల్స్‌ను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చికెన్ నూడుల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చికెన్ – అర కిలో, సోయాసాస్ – నాలుగు టీస్పూన్లు, వెనిగర్, టమాటా కెచప్, రెడ్, గ్రీన్ చిల్లీ సాస్‌లు – రెండు టీస్పూన్ల చొప్పున, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – ఒక టీస్పూన్, చక్కెర – పావు టీస్పూన్, అల్లం, వెల్లుల్లి తరుగు – అర టీస్పూన్ చొప్పున, క్యాప్సికం, క్యారెట్, క్యాబేజీ తరుగు – పావు కప్పు చొప్పున, ఉల్లిపాయ – ఒకటి, వెల్లుల్లి అల్లం ముక్కలు – సగం టీస్పూన్ చొప్పున, నూనె – తగినంత.
చికెన్ నూడుల్స్‌ను తయారు చేసే విధానం..
ఒక గిన్నెలో చికెన్, రెండు టీస్పూన్ల సోయాసాస్, వెనిగర్, ఉప్పు, మిరియాల పొడి వేసి కలిపి గంట పాటు పక్కన పెట్టాలి. స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేయాలి. అది వేడయ్యాక మారినేట్ చేసిన చికెన్‌ను వేసి పెద్ద మంటపై వేయించాలి. పూర్తిగా ఉడికాక పక్కన పెట్టాలి. నూడుల్స్‌ను ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో సోయా, రెడ్, గ్రీన్ చిల్లీ సాస్‌లు, టమాటా కెచప్, చక్కెర, అల్లం వెల్లుల్లి తరుగు వేసి కలపాలి. పాన్‌లో నూనె వేసి వేడయ్యాక క్యాప్సికం, క్యారెట్, క్యాబేజీ తరుగు, ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించాలి. మరోసారి పాన్‌లో నూనె వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం తరుగు, పండు మిర్చి ముక్కలు వేసి వేయించాలి. ఇందులోనే చికెన్ ముక్కలు, వేయించిన కూరగాయలు వేసి కలపాలి. చివరగా సాస్ వేసి మరోసారి కలపాలి. దీంతో ఎంతో రుచికరమైన చికెన్ నూడుల్స్ రెడీ అవుతాయి. వీటిని ఎవరైనా సరే ఇష్టంగా తింటారు.