Unwanted Hair : అందం విషయంలో పురుషుల కన్నా మహిళలే ఎంతో శ్రద్ధ తీసుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే అవాంఛిత రోమాల కారణంగా కొందరు మహిళలు అంద విహీనంగా కనబడతారు. ముఖ్యంగా పెదవులపై మీసాలలా వచ్చే వెంట్రుకలతో చాలా మంది మహిళలు ఇబ్బందులు పడతారు. వాటిని తొలగించుకోవడం కోసం అనేక పద్ధతులను పాటిస్తారు. అయితే కింద ఇచ్చిన టిప్స్ పాటిస్తే అలాంటి వెంట్రుకలను ఎంతో సులభంగా తొలగించుకోవచ్చు. అంతే కాదు, ముఖం కాంతివంతంగా, అందంగా మారుతుంది కూడా. మరి ఆ టిప్స్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా.
కొద్దిగా పసుపు, పాలు లేదంటే పసుపు, నీళ్లు కలిపి మెత్తని పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలపై రాయాలి. వెంట్రుకలు పెరగడానికి వ్యతిరేక దిశలో మిశ్రమాన్ని రాయాలి. ఆ తరువాత కొంత సేపు ఆగితే ఆ పేస్ట్ డ్రై అవుతుంది. దాన్ని చల్లని నీటితో కడిగేయాలి. అనంతరం క్రీం లేదా మాయిశ్చరైజర్ రాయాలి. ఇలా చేయడం వల్ల అవాంఛిత రోమాలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. అలాగే కోడిగుడ్డులో ఉండే తెల్లని సొన, కొద్దిగా చక్కెర, మొక్కజొన్న పిండిలను కలపాలి. ఈ మిశ్రమాన్ని వెంట్రుకలపై అప్లై చేయాలి. 30 నిమిషాలు ఆగాలి. అనంతరం నీటితో కడిగేయాలి. దీంతో ఆ వెంట్రుకలు పోతాయి. అయితే ఇలా వారానికి కనీసం 2 సార్లు చేయాలి.
పెరుగు, శనగ పిండి, పసుపులను కొద్దిగా తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసి కొంత సేపు అయ్యాక కడిగేయాలి. ఇలా చేసినా అవాంఛిత రోమాలను తొలగించుకోవచ్చు. చక్కెర పాకం, నిమ్మ రసం, నీళ్లను కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. దీన్ని వాక్స్ స్ట్రిప్స్ సహాయంతో వెంట్రుకలపై వాక్సింగ్ చేయాలి. ఇలా చేసినా ఆ రోమాలు తొలగిపోతాయి. నిమ్మరసం, తేనెలను బాగా కలిపి మిశ్రమంగా తయారు చేసుకోవాలి. దీన్ని వెంట్రుకలపై రాయాలి. 20 నిమిషాలు ఆగాక ఒక శుభ్రమైన గుడ్డను తీసుకుని దాన్ని వేడి నీటిలో ముంచి తుడవాలి. ఇలా చేస్తే అవాంఛిత రోమాల సమస్య నుంచి బయట పడవచ్చు.
ఏవైనా పప్పు ధాన్యాలను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. ఉదయాన్నే వాటిని తీసి, ఆలుగడ్డలు, నిమ్మరసం, తేనె కలిపి మిశ్రమంగా పట్టుకోవాలి. దాన్ని వెంట్రుకలపై రాయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే సమస్య నుంచి బయట పడవచ్చు. మొక్కజొన్న పిండి, పాలను కలిపి పేస్ట్‌లా చేసి వెంట్రుకలపై రాయాలి. 20 నిమిషాలు ఆగాక కడగాలి. వారానికి ఇలా 3 సార్లు చేస్తే చాలు, ఆ వెంట్రుకలు పెరగవు. బెల్లంతో వాక్సింగ్ చేసుకుంటున్నా అవాంఛిత రోమాల సమస్య నుంచి బయట పడవచ్చు. ఆలుగడ్డను కోసి ఆ ముక్కతో వెంట్రుకలపై మసాజ్‌లా రాయాలి. అనంతరం ఆ ముక్కను అలాగే రాత్రంతా వదిలేసి పడుకోవాలి. ఉదయం లేవగానే కడిగేయాలి. దీంతో అవాంఛిత రోమాలు పోతాయి.