information

ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకుంటున్నారా ? ఈ ముఖ్య‌మైన విష‌యాలు తెలుసుకోండి..!

ఆర్థిక స‌మ‌స్య‌లు అనేవి నిజానికి మ‌న‌కు ఎప్పుడు వ‌స్తాయో తెలియ‌దు. ఉన్న ప‌ళంగా వచ్చే డ‌బ్బు స‌మ‌స్య‌కు మ‌నం ఒక్కోసారి తీవ్ర ఇబ్బందులు ప‌డుతాం. అలాంటి స‌మ‌యాల్లో మ‌న‌కు ప‌ర్స‌న‌ల్ లోన్ గుర్తుకు వ‌స్తుంది. ప్ర‌స్తుతం అంతా డిజిట‌ల్‌మ‌యం అయింది. అందువ‌ల్ల ఇప్పుడు ప‌ర్స‌న‌ల్ లోన్‌కు అప్లై చేయ‌డం, పొంద‌డం చాలా తేలికైంది. కేవ‌లం 1, 2 రోజుల్లోనే లోన్ పొందే సౌల‌భ్యం కూడా ల‌భిస్తోంది. అయితే ఎవ‌రైనా స‌రే.. ప‌ర్స‌న‌ల్ లోన్‌కు అప్లై చేసే ముందు ఈ విష‌యాల‌ను త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాలి. అవేమిటంటే…

1. క్రెడిట్ స్కోరు బాగుంటేనే బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీలు ప‌ర్స‌న‌ల్ లోన్ ఇస్తాయ‌న్న సంగ‌తి తెలిసిందే. అందువ‌ల్ల ప‌ర్స‌న‌ల్ లోన్‌కు అప్లై చేసే ముందు క్రెడిట్ స్కోరును ఒక సారి చెక్ చేసుకోవాలి. ప్ర‌స్తుతం అధిక శాతం ఫైనాన్స్ సంబంధ వెబ్‌సైట్ల‌లో ఉచితంగానే క్రెడిట్ స్కోరును చెక్ చేసేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. ఆయా సైట్ల‌లో క్రెడిట్ స్కోరును చెక్ చేసుకున్నాక‌.. స్కోరు 750 మించి ఉండాలి. అలా ఉంటేనే ప‌ర్స‌న‌ల్ లోన్‌కు అప్లై చేయండి. లేదంటే లోన్ అప్లికేష‌న్ తిర‌స్క‌ర‌ణ‌కు గుర‌య్యే అవ‌కాశాలే ఎక్కువ‌గా ఉంటాయి. క‌నుక స్కోర్ బాగుంటేనే లోన్‌కు అప్లై చేయండి. స్కోర్ బాగా లేకున్నా లోన్‌కు అప్లై చేస్తే అప్లికేష‌న్ రిజెక్ట్ అవ‌డంతోపాటు స్కోరు ఇంకా త‌గ్గేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక అలా చేయ‌కండి.

if you are taking personal loan then look for these

2. ప‌ర్స‌న‌ల్ లోన్ల‌కు గాను భిన్న ర‌కాల బ్యాంకులు భిన్న ర‌కాల వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తుంటాయి. వాటిలో త‌క్కువ వ‌డ్డీ రేటు ఇచ్చే బ్యాంకులు ఏవో ఒక‌సారి చెక్ చేయండి. అయితే వ‌డ్డీ రేటు త‌క్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ కొన్ని బ్యాంకులు ఇత‌ర చార్జిల‌ను ఎక్కువ‌గా వ‌సూలు చేస్తాయి. క‌నుక ఈ విష‌యాన్ని కూడా ఒక‌సారి ప‌రిశీలించాలి. అన్ని వివ‌రాల‌ను చెక్ చేశాకే.. లోన్ అప్లై చేసేందుకు ఏ బ్యాంక్, ఫైనాన్స్ కంపెనీ అయితే బాగుంటుందో చూసుకుని.. అందులోనే లోన్‌కు అప్లై చేయాలి. దీంతో వ‌డ్డీరేటు ప‌రంగా, ఇత‌ర చార్జిల ప‌రంగా త‌క్కువ మొత్తంలో చెల్లించేందుకు అవ‌కాశం ఉంటుంది.

3. మీరు తీసుకునే లోన్ మొత్తానికి గాను నెల నెలా ఈఎంఐ ఎంత అవుతుంది ? ఎన్ని నెల‌ల పాటు చెల్లించాలి ? అనే వివ‌రాల‌ను ముందుగానే చెక్ చేసుకుని లోన్ తీసుకోండి. కొన్ని ఫైనాన్స్ కంపెనీలు త‌క్కువ నెల‌ల ఈఎంఐ ఫెసిలిటీ అంద‌జేస్తాయి. కానీ నెల నెలా చెల్లించాల్సిన ఈఎంఐ ఎక్కువ ఉంటుంది. కొన్ని కంపెనీలు ఎక్కువ నెల‌ల వాయిదాల‌ను చెల్లించేలా సౌక‌ర్యం అందిస్తాయి. కానీ వ‌డ్డీ ఎక్కువ అవుతుంది. క‌నుక నెల‌కు ఎంత ఈఎంఐ అయితే బాగుంటుందో చెక్ చేసుకుని అందుకు అనుగుణంగా లోన్ తీసుకోండి. దాంతో సుల‌భంగా నెల నెలా వాయిదాల‌ను చెల్లించ‌వ‌చ్చు.

4. కొంద‌రు ఒకేసారి భిన్న బ్యాంకులు, ఫైనాన్స్ కంపెనీల్లో ప‌ర్స‌న‌ల్ లోన్ల‌కు అప్లై చేస్తారు. అలా చేయ‌వ‌ద్దు. అలా చేస్తే క్రెడిట్ స్కోరు ఒకే సారి బాగా త‌గ్గుతుంది. దీంతో బ్యాంకులు లోన్ అప్లికేష‌న్‌ను రిజెక్ట్ చేసే అవ‌కాశం కూడా ఉంటుంది. క‌నుక ఒక‌సారి ఏదైనా ఒక బ్యాంకు లేదా ఫైనాన్స్ కంపెనీలోనే ప‌ర్స‌న‌ల్ లోన్‌కు అప్లై చేయండి. రిజెక్ట్ అయితే కార‌ణాల‌ను తెలుసుకుని వాటిని స‌రిచేసుకుని ఇంకో బ్యాంకు లేదా ఫైనాన్స్ సంస్థ‌లో లోన్‌కు అప్లై చేయ‌వ‌చ్చు. ఇలా చేస్తే రెండో య‌త్నంలో లోన్ వ‌చ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. అలాగే ఒక బ్యాంకులో లోన్ అప్లై చేశాక మ‌ళ్లీ అదే బ్యాంకులో లోన్‌కు అప్లై చేయాలంటే క‌నీసం 3 నుంచి 6 నెల‌ల పాటు వేచి చూడ‌డం మంచిది. అలా చేయ‌క‌పోతే లోన్ అప్లికేష‌న్ మ‌ళ్లీ రిజెక్ట్ అయ్యేందుకే ఎక్కువ అవ‌కాశాలు ఉంటాయి.

5. ప‌ర్స‌న‌ల్ లోన్ తీసుకుంటే నెల నెలా ఈఎంఐ చెల్లించాలి క‌నుక మీకు వ‌చ్చే ఆదాయానికి ఆ ఈఎంఐ చెల్లిస్తామా, లేదా.. అనే విష‌యాల‌ను కూడా ముందుగా చెక్ చేసుకోవాలి. అలాగే భ‌విష్య‌త్తులో అనుకోకుండా ఉద్యోగం కోల్పోతే ఆ భారం వ‌ల్ల ఈఎంఐ చెల్లించ‌లేని స్థితి వ‌స్తుంది. అలాంట‌ప్పుడు ఇంకో ఉద్యోగం వెదుక్కునే వ‌ర‌కు నెల నెలా ఈఎంఐల‌ను చెల్లించడానికి ముందుగానే ఎమ‌ర్జెన్సీ ఫండ్‌ను సిద్ధం చేసుకోవాలి. క‌నీసం ఒక 6 నెల‌ల జీతాన్ని ప‌క్క‌న పెట్టి.. దాన్ని అలాంటి ఎమ‌ర్జెన్సీల్లో ఉప‌యోగించుకోవాలి. దీంతో అనుకోకుండా వ‌చ్చే ఆర్థిక స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

Admin

Recent Posts