మనం జీవించడానికి అవసరం ఉన్న ప్రధాన అంశాల్లో గాలి కూడా ఒకటి. గాలి లేకపోతే మానవులకే కాదు, సకల జీవరాశులకు మనుగడే లేదు. ఒకప్పుడంటే చాలా అరణ్యాలు, వృక్షాలు ఎక్కడ పడితే అక్కడ ఉండేవి. దీంతో మనకు స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు లభించేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కాలుష్యం రక్కసి కోరలు చాచింది. దీంతో మనకు స్వచ్ఛమైన గాలి అస్సలు లభించడం లేదు. దీంతో కాలుష్యం బారిన పడి మనం అనేక అనారోగ్యాలకు గురవుతూనే ఉన్నాం. అయితే కింద ఇచ్చిన పలు మొక్కలను మీ ఇంట్లో పెంచుకుంటే దాంతో మీకు స్వచ్ఛమైన గాలి లభించడమే కాదు, మీ పరిసరాల్లో గాలిలో ఉన్న దుమ్ము, ధూళి, సూక్ష్మ కణాలు, అణువులు ఫిల్టర్ అవుతాయి. దీని వల్ల అత్యంత నాణ్యమైన ఆక్సిజన్ మీకు లభిస్తుంది. ఈ మొక్కలు చిన్నగా ఉండడం వల్ల ఎంత తక్కువ ప్రదేశం ఇంట్లో ఉన్నా అక్కడ వీటిని నిరభ్యంతరంగా పెంచుకోవచ్చు. ఆ మొక్కలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
అలోవెరా (కలబంద)… గాలిలో ఉన్న కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్ వంటి పలు విషపు వాయువులను కలబంద మొక్క తొలగిస్తుంది. గాలిని ఫిల్టర్ చేస్తుంది. దీంతో స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకు లభిస్తుంది. ఫికస్ (Ficus)… ఫికస్ ఎలస్టికా (Ficus Elastica) అని పిలవబడే ఈ మొక్కకు సూర్యరశ్మి అవసరం లేదు. వెలుతురు లేకున్నా ఈ మొక్క పెరుగుతుంది. అంతేకాదు గాలిలో ఉండే ఫార్మాల్డిహైడ్ వంటి వాయువులను ఈ మొక్క ఫిల్టర్ చేస్తుంది. అయితే ఈ మొక్కకు పిల్లలను, పెంపుడు జంతువులను దూరంగా ఉంచడం మంచిది. లేదంటే అలర్జీలు వస్తాయి. ఐవీ (Ivy)… హెడెరా హీలిక్స్ (Hedera Helix) అని పిలవబడై ఐవీ జాతికి చెందిన మొక్క గాలిలో ఉండే విషపు వాయువుల ప్రభావాన్ని 60 శాతం వరకు తగ్గిస్తుంది. అంతగా గాలిని ఫిల్టర్ చేస్తుంది ఈ మొక్క. ఒక 6 గంటల పాటు మీ ఇంట్లో ఈ మొక్కను ఉంచితే చాలు గాలి అంతా శుభ్రమవుతుంది. అలాంటి ఇక ఎప్పటికీ ఇంట్లోనే ఈ మొక్కను పెంచుకుంటే దాంతో మీ పరిసరాల్లో ఉండే గాలి ఎంత శుభ్రమవుతుందో ఇట్టే తెలిసిపోతుంది.
స్పైడర్ ప్లాంట్ (Spider plant)… ఈ మొక్కను క్లోరోపైటమ్ కొమోసమ్ (Chlorophytum Comosum) అని కూడా పిలుస్తారు. ఎంత చీకటి వాతావరణంలోనైనా మనగలిగే శక్తి ఈ మొక్కకు ఉంది. గాలిలో ఉన్న కార్బన్ మోనాక్సైడ్, ఫార్మాల్డిహైడ్, గ్యాసోలిన్ వంటి వాయువులను ఈ మొక్క ఫిల్టర్ చేస్తుంది. ఈ మొక్క దాని చుట్టూ దాదాపుగా 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న పరిసరాల్లోని గాలిని చాలా స్వచ్ఛమైన గాలిగా మార్చగలదు. స్నేక్ ప్లాంట్… Sansevieria Trifasciata Laurentil అని కూడా ఈ మొక్కను పిలుస్తారు. పైన చెప్పిన మొక్కల్లాగే ఈ మొక్క కూడా ఎంత చీకటి వాతావరణం ఉన్నా పెరుగుతుంది. గాలిలో ఉన్న విషపు వాయువులను నిర్మూలిస్తుంది. బెడ్‌రూంలో ఈ మొక్కను గనక పెట్టుకుంటే దాంతో స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను రాత్రంతా పీల్చుకోవచ్చు.
పీస్ లిల్లీస్ (Peace lilies)… Mauna Loa Spathiphyllum అని కూడా ఈ మొక్కను పిలుస్తారు. గాలిలో ఉన్న రసాయనిక వాయువులను ఈ మొక్క తొలగిస్తుంది. గాలిని స్వచ్ఛంగా మారుస్తుంది. పైన చెప్పిన మొక్కలన్నీ ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా సూచించినవే. వీటిలో ఏ మొక్కను పెంచుకున్నా దాంతో మన చుట్టూ ఉన్న పరిసరాల్లో గాలి చాలా శుభ్రమవుతుంది. స్వచ్ఛమైన ఆక్సిజన్ లభిస్తుంది. అయితే ఒకటి కన్నా ఎక్కువ మొక్కలను పెట్టేవారు ఒక్కో మొక్కకు కనీసం 80 అడుగుల దూరం ఉండేలా చూడడం మంచిది. దీంతో మరింత గాలి ఫిల్టర్ అవుతుంది.