Liver : మన శరీరంలో ముఖ్యమైన అవయవాల్లో కాలేయం కూడా ఒకటి. మన శరీరంలో కాలేయం నిరంతరం పని చేస్తూనే ఉంటుంది. అలాగే కాలేయం అనేక ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. మనం తీసుకున్న ఆహారంలో ఉండే పురుగుమందులను విచ్ఛిన్నం చేయడంలో, మనం వాడే మందుల్లో ఉండే రసాయనాలను విచ్చినం చేయడంలో, పోషకాలను నిల్వ చేయడంలో, మనం తిన్న ఆహారం జీర్ణమవ్వడానికి అవసరమయ్యే రసాయనాలను విడుదల చేయడంలో, శరీరంలో మలినాలను తొలగించడంలో, రక్తం గడ్డకట్టడానికి అవసరమయ్యే ఎంజైమ్ లను విడుదల చేయడంలో, శరీరంలో వివిధ హార్మోన్ల ఉత్పత్తిని నియంత్రించడం ఇలా అనేక రకాల విధులను కాలేయం నిర్వర్తిస్తుంది. కనుక మనం కాలేయాన్ని ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కాలేయం దెబ్బతింటే మన ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది.
కాలేయం దెబ్బతినడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఆల్కహాల్ సేవించడం, మత్తు పదార్థాలు తీసుకోవడం, ఇన్ఫెక్షన్స్, కొవ్వు పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, కలుషిత ఆహారాన్ని తీసుకోవడం, వివిధ రకాల అనారోగ్య సమస్యలకు మందులను ఎక్కువగా వాడడం వంటి వివిధ కారణాల చేత కాలేయం దెబ్బతింటుంది. కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తినప్పుడు కొన్ని రకాల లక్షణాలు మనలో కనిపిస్తాయి. ఈ లక్షణాలను మనం ముందుగానే గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మనం కాలేయ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కాలేయ సంబంధిత సమస్యలు తలెత్తగానే ముందుగా జీర్ణవ్యవస్థ మందగిస్తుంది.
తిన్న ఆహారం జీర్ణమవ్వకపోవడం, నీరు తాగినా జీర్ణమవ్వకపోవడం, ఆకలి లేకపోవడం, అలాగే జీర్ణ సమస్యలు దీర్ఘకాలం పాటు ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించి కాలేయ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. అలాగే కాలేయ సమస్యలు ఉన్నప్పుడు చర్మం రంగు మారుతుంది. చర్మం రంగును క్రమంగా కోల్పోతుంది. చర్మంపై తెల్లమచ్చలు ఏర్పడతాయి. అలాగే కాలేయ సమస్యలు ఉన్నప్పుడు మూత్రం ముదురు పసుపు పచ్చ రంగులో ఉంటుంది. మూత్రం తరచూ ఇదే రంగులో వస్తూ ఉంటే జాగ్రత్త పడడం అవసరం. అలాగే కళ్లు, గోర్లు పసుపు పచ్చగా మారినప్పుడు కూడా మనం కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నాయని గ్రహించాలి. అలాగే ఎప్పుడూ నోరు చేదుగా ఉన్నా కూడా కాలేయ సమస్యలు ఉన్నాయని అర్థం. అలాగే కాలేయ సమస్యలు ఉండడం వల్ల నీరసం, త్వరగా అలసిపోవడం వంటివి కూడా జరుగుతాయి.
అలాగే కాలేయ సంబంధిత సమస్యలు ఉండడం వల్ల మనం బరువు పెరుగుతాము. అలాగే కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నప్పుడు మన నోటి నుండి ఎల్లప్పుడు దుర్వాసన వస్తుంది. కాళ్ల వాపులు కూడా వస్తాయి. చర్మ సమస్యలు, అలర్జీ, దురదల బారిన పడాల్సి వస్తుంది. చెమటలు ఎక్కువగా వస్తాయి. నరాలు ఉబ్బినట్టు కనబడతాయి. అంతేకాకుండా కడుపులో నొప్పి కూడా వస్తుంది. మనలో ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యున్ని సంప్రదించి కాలేయ సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. ఈ సమస్యలు ప్రారంభ దశలో ఉన్నప్పుడే తగిన చికిత్స తీసుకోవడం వల్ల మనం తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము.