Hotel Style Sambar : ఇలా చేస్తే హోట‌ల్స్ లాంటి సాంబార్ రెడీ అవుతుంది.. రుచి అమోఘంగా ఉంటుంది..!

Hotel Style Sambar : మ‌నకు టిఫిన్ సెంట‌ర్ల‌ల్లో, బండ్ల మీద అల్పాహారాల‌ను తిన‌డానికి చ‌ట్నీల‌తో పాటు సాంబార్ ను కూడా ఇస్తూ ఉంటారు. అల్ఫాహారాల‌ను తిన‌డానికి ఇచ్చే ఈ సాంబార్ చాలా రుచిగా, చిక్క‌గా, ఘుమ‌ఘుమ‌లాడుతూ ఉంటుంది. అచ్చం టిఫిన్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే విధంగా చిక్క‌గా, రుచిగా ఉండే ఈ సాంబార్ ను మ‌నం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. టిఫిన్ సాంబార్ ను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. చ‌క్క‌టి రుచిని క‌లిగి ఉండే ఈ టిఫిన్ సాంబార్ త‌యారీ విధానాన్ని అలాగే త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

టిఫిన్ సాంబార్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కందిప‌ప్పు – ఒక క‌ప్పు, పెస‌ర‌ప‌ప్పు – అర క‌ప్పు, నీళ్లు – మూడున్న‌ర క‌ప్పులు, నూనె – 3 టేబుల్ స్పూన్స్, ఆవాలు -ఒక టీ స్పూన్, శ‌న‌గ‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, మిన‌ప‌ప్పు – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 6, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, ఉప్పు – త‌గినంత‌, ప‌సుపు – అర టీ స్పూన్, చిన్న ఉల్లిపాయ‌లు – 200 గ్రా., త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన మున‌క్కాయ – 1, త‌రిగిన ట‌మాట – 1, కారం – ఒక టేబుల్ స్పూన్, ధ‌నియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, చిక్క‌టి చింత‌పండు గుజ్జు – పావు క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – రెండు టేబుల్ స్పూన్స్, ఇంగువ – పావు టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్.

Hotel Style Sambar how to make this very tasty
Hotel Style Sambar

టిఫిన్ సాంబార్ త‌యారీ విధానం..

ముందుగా కుక్క‌ర్ లో కందిప‌ప్పును, పెస‌ర‌ప‌ప్పును తీసుకుని శుభ్రంగా కడ‌గాలి. త‌రువాత నీళ్లు పోసి మూత పెట్టి 5 విజిల్స్ వ‌చ్చే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మూత తీసి ప‌ప్పును మెత్త‌గా చేసుకుని ప‌క్క‌కు ఉంచాలి. ఇప్పుడు క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక ఆవాలు, జీల‌క‌ర్ర‌, మిన‌ప‌ప్పు, శ‌న‌గ‌ప‌ప్పు వేసి వేయించాలి. త‌రువాత క‌రివేపాకు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బ‌లు వేసి వేయించాలి. త‌రువాత ప‌చ్చిమిర్చి, ప‌సుపు, ఉప్పు, ఉల్లిపాయ‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ‌లు వేగిన త‌రువాత క్యారెట్ ముక్క‌లు, మున‌క్కాయ ముక్క‌లు, ట‌మాట ముక్క‌లు వేసి క‌ల‌పాలి. త‌రువాత కారం, ధ‌నియాల పొడి వేసి క‌ల‌పాలి. త‌రువాత అర లీట‌ర్ నీళ్లు పోసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి.

త‌రువాత ఈ ముక్క‌ల‌ను ముందుగా త‌యారు చేసుకున్న ప‌ప్పులో వేసి క‌ల‌పాలి. ఇందులోనే చింత‌పండు గుజ్జు, మ‌రో అర లీట‌ర్ నీళ్లు పోసి క‌లిపి సాంబార్ ను ఉడికించాలి. మున‌క్కాయ ముక్క‌లు మెత్త‌గా ఉడికిన త‌రువాత ఇంగువ‌, కొత్తిమీర వేసి క‌ల‌పాలి. దీనిని మ‌రో రెండు నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత నెయ్యి వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల చిక్క‌గా, రుచిగా ఉండే సాంబార్ త‌యార‌వుతుంది. దీనిని టిఫిన్స్ తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ సాంబార్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts