Iodine Deficiency Symptoms : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో అయోడిన్ కూడా ఒకటి. థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరచడంలో, థైరాయిడ్ గ్రంథి తన విధులను సక్రమంగా నిర్వర్తించేలా చేయడంలో అయోడిన్ మన శరీరానికి ఎంతో అవసరం. కానీ నేటి తరుణంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగా మనలో చాలా మంది అయోడిన్ లోపంతో బాధపడుతున్నారు. శరీరంలో అయోడిన్ లోపించడం వల్ల మనం థైరాయిడ్ సమస్య బారిన పడే అవకాశం ఉంది. ఈ సమస్య బారిన ఒక్కసారి పడితే మనం జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. అయితే మనలో చాలా మంది వారిలో అయోడిన్ లోపం ఉందని కూడా తెలుసుకోలేకపోతున్నారు. శరీరంలో అయోడిన్ లోపించడం వల్ల మనలో కొన్నిలక్షణాలు కనిపిస్తాయి. చాలా మందికి ఈ లక్షణాల గురించి తెలియక థైరాయిడ్ బారిన పడుతున్నారు.
కనుక మనం అయోడిన్ లోపించడం వల్ల కలిగే లక్షణాల గురించి అవగాహన కలిగి ఉండడం మంచిది. శరీరంలో అయోడిన్ లోపించడం వల్ల మనలో కనిపించే లక్షణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయోడిన్ లోపించడం వల్ల మనకు ఎక్కువ చల్లగా అనిపిస్తుంది. సాధారణ ఉష్ణోగ్రత ఉన్నప్పటికి మనకు ఎక్కువగా చల్లగా ఉంటుంది. వణుకు వస్తుంది. అయోడిన్ లోపించడం వల్ల కనిపించే లక్షణాల్లో ఇది ఒకటి. అలాగే చర్మం పొడిగా పొరలు పొరలుగా మారుతుంది. అయోడిన్ లోపించడం వల్ల చర్మం తేమను నిలుపుకునే శక్తిని కోల్పోతుంది. మాయిశ్చరైజర్ రాసినప్పటికి చర్మం పొడిగా మారుతుంది. ఈ లక్షణం కనిపిస్తే కనుక వెంటనే అయోడిన్ పరీక్షలు చేయించుకోవాలి. అలాగే అయోడిన్ లోపించడం వల్ల శరీరం తీవ్ర అలసటకు గురి అవుతుంది.
శరీరంలో శక్తిని ఉత్పత్తి చేయడంలో అయోడిన్ ఎంతో అవసరం. కనుక అయోడిన్ లోపించడం వల్ల తగినంత శక్తి లభించక మనం నీరసానికి గురి అవుతాము. అదేవిధంగా అయోడిన్ లోపం గాయిటర్ సమస్యకు కూడా దారి తీస్తుంది. తగినంత అయోడిన్ లేనప్పుడు థైరాయిడ్ గ్రంథి ఉబ్బి గాయిటర్ సమస్యకు దారితీస్తుంది. అయోడిన్ లోపించడం వల్ల మెదడు పనితీరు కూడా మందగిస్తుంది. జ్ఞాపక శక్తి తగ్గుతుంది. అభిజ్ఞా పనితీరుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. దృష్టిని కేంద్రీకరించలేకపోతాము.
అలాగే స్త్రీలల్లో అయోడిన్ లోపించడం వల్ల నెలసరి సక్రమంగా రాదు. హార్మోన్ల అసమతుల్యతలతో బాధపడాల్సి వస్తుంది. అదే విధంగా అయోడిన్ లోపించడం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. .జుట్టు పలుచగా మారుతుంది. ఇక అయోడిన్ లోపించడం వల్ల శరీర బరువు విపరీతంగా తగ్గుతారు. ఈ విధంగా ఈ లక్షణాలను బట్టి శరీరంలో అయోడిన్ లోపం తలెత్తిందని గ్రహించాలి. అలాగే అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల ఈ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు.