Reincarnation : మీకు పునర్జన్మలపై నమ్మకం ఉందా..? సాధారణంగానైతే చాలా తక్కువ మందే దీన్ని నమ్ముతారు, ఎవరూ పునర్జన్మల గురించి నమ్మరు. అయితే పునర్జన్మలను కథాంశాలుగా చేసుకుని అనేక సినిమాలు వచ్చాయి. చాలా మంది రచయితలు నవలలు, కథలు కూడా రాశారు. ఈ క్రమంలో ఏ సినిమాను తీసుకున్నా, కథలో, నవలలో చదివినా వాటిలో ఏం చెబుతారంటే చనిపోయిన మనిషి మళ్లీ మనిషిగా జన్మిస్తాడని అంటారు. అచ్చం అవే పోలికలతో మళ్లీ జన్మిస్తారని వాటిలో పేర్కొంటారు. కానీ నిజంగా శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే చనిపోయిన మనిషి మళ్లీ మనిషి జన్మ ఎత్తడట. అతను చేసిన పాపాలను బట్టి ఏదో ఒక జీవిగా జన్మిస్తాడట. ఈ క్రమంలో మనిషి ఎలాంటి పాపాలు చేస్తే మళ్లీ జన్మలో ఏ జీవిగా పుడతాడో ఇప్పుడు తెలుసుకుందాం.
శాస్త్రాలను అవహేళిన చేసిన వారు మళ్లీ వచ్చే జన్మలో పాండు రోగంతో పుడతారని పురాణాలు చెబుతున్నాయి. స్త్రీలను హత్య చేసే వారు మరుసటి జన్మలో ఎల్లప్పుడూ రోగాలను అనుభవిస్తూ ఉంటారట. అబద్దపు సాక్ష్యం చెప్పిన వారు మూగవారుగా పుడతారట. అబద్దాలను వినేవారు చీమలై పుడతారట. పుస్తకాలను దొంగిలించే వ్యక్తులు అంధులుగా పుడతారట. వ్యభిచారం చేసే వారు అడవిలో ఏనుగులుగా జన్మిస్తారట. పిలవని పేరంటానికి వెళ్ళినవారు కాకులుగా మరుసటి జన్మలో జన్మిస్తారట.
మిత్రులను అదే పనిగా మోసం చేసే వారు మరుసటి జన్మలో గద్దగా పుడతారట. భర్తలను, ఇతర వ్యక్తులను హింసించే స్త్రీలు జలగలుగా మరుసటి జన్మలో పుడతారట. ఇతరులను మోసం చేస్తూ వస్తువులను అమ్మేవారు మరుసటి జన్మలో గుడ్ల గూబలుగా పుడతారట. భర్తలను మోసం చేసే ఆడవారు బల్లులుగా జన్మిస్తారట. గురుపత్నితో సంభోగం చేసే వారు తొండలుగా జన్మిస్తారట. అతిగా కామం కలిగినవారు గుర్రాలుగా పుడతారట. భార్యలను ఎక్కువగా హింసించే వారు మేకలుగా పుడతారట.