Aloo Kothimeera Rice : ఆలు కొత్తిమీర రైస్ త‌యారీ ఇలా.. ఎంతో టేస్టీగా ఉంటుంది..

Aloo Kothimeera Rice : మ‌నం వంటల్లో కొత్తిమీర‌ను ఉప‌యోగిస్తూ ఉంటాం. కొత్తిమీర‌ను వాడ‌డం వ‌ల్ల రుచితో పాటు మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. వంట‌ల్లో వాడ‌డంతో పాటు మనం కొత్తిమీర‌తో ఎంతో రుచిగా ఉండే రైస్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. ఇందులో బంగాళాదుంప ముక్క‌ల‌ను వేసి మ‌రింత రుచిగా ఆలూ కొత్తిమీర రైస్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. అన్నం ఎక్కువ‌గా మిగిలిన‌ప్పుడు కూడా ఈ రైస్ ను త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు. ఎంతో రుచిగా ఉండే ఆలూ కొత్తిమీర రైస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి..త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఆలూ కొత్తిమీర రైస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

త‌రిగిన బంగాళాదుంప – 1, కొత్తిమీర క‌ట్ట‌లు – 4, అన్నం – 2 క‌ప్పుల బియ్యంతో వండినంత, త‌రిగిన ట‌మాటాలు – 2, త‌రిగిన ఉల్లిపాయ – 1, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ఉప్పు – త‌గినంత, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ప‌సుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, జీడిపప్పు – కొద్దిగా, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, క‌రివేపాకు – ఒక రెమ్మ‌.

Aloo Kothimeera Rice recipe in telugu make in this way
Aloo Kothimeera Rice

మ‌సాలా దినుసులు..

బిర్యానీ ఆకు – 1, ల‌వంగాలు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 2, అనాస పువ్వు – ఒక‌టి.

ఆలూ కొత్తిమీర రైస్ త‌యారీ విధానం..

ముందుగా ఒక జార్ లో కొత్తిమీర‌, కొద్దిగా నీళ్లు పోసి మెత్త‌గా పేస్ట్ లాగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడ‌య్యాక జీల‌క‌ర్ర‌, మ‌సాలా దినుసులు, జీడిప‌ప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు, ప‌చ్చిమిర్చి ముక్క‌లు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్క‌లు స‌గం వేగిన త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి మ‌ధ్య మ‌ధ్య‌లో క‌లుపుతూ బంగాళాదుంప ముక్క‌ల‌ను మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి. ఇప్పుడు ట‌మాట ముక్క‌లు, ఉప్పు, అల్లం పేస్ట్ వేసి క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మ‌ర‌లా మూత‌ను ఉంచి ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు వేయించాలి.

ట‌మాట ముక్క‌లు మెత్త‌గా అయిన త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న కొత్తిమీర పేస్ట్, ప‌సుపు, గ‌రం మ‌సాలా, క‌రివేపాకు వేసి క‌ల‌పాలి. దీనిని నూనె పైకి తేలే వ‌ర‌కు వేయించిన త‌రువాత అన్నం వేసి అంతా క‌లిసేలా బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. త‌రువాత కొద్దిగా కొత్తమీర‌ను వేసి క‌లిపి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఆలూ కొత్తిమీర రైస్ త‌యారవుతుంది. దీనిని రైతాతో కూడా తిన‌వ‌చ్చు. లంచ్ బాక్స్ ల‌ల్లోకి కూడా ఈ రైస్ చాలా చ‌క్క‌గా ఉంటుంది. కొత్తిమీర‌తో ఈ విధంగా చేసిన రైస్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts