Cashew Nuts Tomato Curry : డ్రై ఫ్రూట్స్ ను ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయని మనందరికీ తెలుసు. మనం ఆహారంగా తీసుకునే డ్రై ఫ్రూట్స్ లో జీడి పప్పు కూడా ఒకటి. జీడిపప్పును తినడం వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. రక్త హీనతను తగ్గించడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, బీపీని నియంత్రించడంలో జీడిపప్పు ఎంతో సహాయపడుతుంది. జీడిపప్పును తినడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.
దీన్ని తింటే చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటాయి. పిత్తాశయంలో రాళ్లు ఏర్పడే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఒత్తిడిని తగ్గించి, మానసిక స్థితిని మెరుగుపరచడంలో, మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో కూడా జీడిపప్పు ఉపయోగపడుతుంది. జీడిపప్పును నేరుగా చాలా మంది తింటూ ఉంటారు. రకరకాల వంటల తయారీలో కూడా జీడిపప్పును ఉపయోగిస్తూ ఉంటారు. మనం సాధారణంగా టమాట కూరను తయారు చేస్తూ ఉంటాం. టమాట కూర చాలా రుచిగా ఉంటుందని మనందరికీకి తెలుసు. అయితే జీడిపప్పును వేసి చేసే టమాట కూర కూడా ఇంకా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్ల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది. ఇక జీడిపప్పును వేసి టమాట కూరను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జీడిపప్పు టమాట కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
జీడి పప్పు – 5 టేబుల్ స్పూన్స్, తరిగిన టమాటాలు – 2 (పెద్దవి), నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 2, దాల్చిన చెక్క ముక్క – 1 (చిన్నది), జీలకర్ర – అర టీ స్పూన్, కరివేపాకు – ఒక రెబ్బ, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2 (మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన పచ్చి మిర్చి -2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
జీడిపప్పు టమాట కూర తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి వేసి కరిగిన తరువాత జీడిపప్పును వేసి వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. అదే కళాయిలో నూనెను వేసి వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. ఇప్పుడు పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత తరిగిన టమాట ముక్కలు వేసి కలిపి మూత పెట్టి టమాటాలను పూర్తిగా ఉడికించుకోవాలి.
మధ్య మధ్య లో మూత తీసి టమాటాలను కలుపుతూ ఉండాలి. టమాటాలు పూర్తిగా ఉడికిన తరువాత కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి కలిపి 2 నిమిషాల పాటు ఉంచాలి. ఇప్పుడు వేయించిన జీడిపప్పును వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నీళ్లను పోసి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉంచి, చివరగా కొత్తిమీరను వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే జీడిపప్పు టమాట కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా, రోటీ వంటి వాటితో కలిపి తింటే రుచితోపాటు జీడిపప్పు వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు. తరచూ చేసే టమాట కూరకు బదులుగా అప్పుడప్పుడూ ఇలా జీడిపప్పును వేసి టమాట కూర చేసుకుని తినడం వల్ల రుచి, ఆరోగ్యం రెండు మీ సొంతమవుతాయి.