Chana Dal Vada : శనగపప్పు.. మనం వంటింట్లో ఉండే పప్పు దినుసుల్లో ఇది కూడా ఒకటి. శనగపప్పులో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ పప్పును ఆహారంగా తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. ఈ శనగపప్పుతో అనేక రకాల వంటలు, పిండి వంటలు తయారు చేస్తూ ఉంటాము. అలాగే ఈ పప్పుతో మనం రుచిగా, కరకరలాడుతూ ఉండే వడలను కూడా తయారు చేసుకోవచ్చు. శనగపప్పుతో చేసే ఈ వడలు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా తినడానికి చాలా చక్కగా ఉంటాయి. ఎంతో రుచిగా ఉండే ఈ శనగపప్పు వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శనగపప్పు వడ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – 2 కప్పులు, పచ్చిమిర్చి – 2, ఎండుమిర్చి – 1, వెల్లుల్లి రెబ్బలు – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, బియ్యం పిండి – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్.
శనగపప్పు వడల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో శనగపప్పును తీసుకోవాలి. దీనిని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఈ శనగపప్పును ఒక జార్ లోకి తీసుకోవాలి. ఇదే జార్ లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత దీనిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. తరువాత చేతులకు నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వడల ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి.
నూనె వేడయ్యాక వడలను వేసి కాల్చుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే శనగపప్పు వడలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో లేదా టమాట చట్నీ, పల్లీ చట్నీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా శనగపప్పుతో వడలను తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు శనగపప్పులో ఉండే పోషకాలను కూడా పొందవచ్చు.