Chemagadda Karam Pulusu : మనం చేమగడ్డలను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. చేమగడ్డలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఎన్నో పోషకాలతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలి. చేమగడ్డలను తినడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. చేమగడ్డలతో మనం కూరతో పాటు పులుసును కూడా తయారు చేస్తూ ఉంటాం. చేమగడ్డ పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఈ చేమగడ్డ పులుసును మనం వివిధ రకాలుగా కూడా తయారు చేస్తూ ఉంటాం. అందరికి నచ్చేలా రాయలసీమ స్టైల్ లో చేమగడ్డ కారం పులుసును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చేమగడ్డ కారం పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
చేమగడ్డ – 300 గ్రా., పసుపు – పావు టీ స్పూన్, నూనె – 4 టేబుల్ స్పూన్స్, మెంతులు – అర టీ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, కరివేపాకు – రెండు రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు – 10, సాంబార్ ఉల్లిపాయలు – 10, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం తరుగు -ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, తరిగిన టమాటాలు – 2, చింతపండు రసం – 300 ఎమ్ ఎల్, నీళ్లు – 750 ఎమ్ ఎల్, పచ్చి కొబ్బరి పేస్ట్ – అర కప్పు.
మసాలా పేస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
శనగపప్పు – ఒక టేబుల్ స్పూన్, మిరియాలు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 15, ధనియాలు – రెండున్నర టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – రెండురెమ్మలు.
చేమగడ్డ కారం పులుసు తయారీ విధానం..
ముందుగా కళాయిలో శనగపప్పు వేసి వేడి చేయాలి. శనగపప్పు చక్కగా వేగిన తరువాత మిరియాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఎండుమిర్చి కొద్దిగా రంగు మారిన తరువాత ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. కరివేపాకును కరకరలాడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని పూర్తిగా చల్లారే వరకు అలాగే ఉంచాలి. తరువాత వీటిని జార్ లో వేసి తగినన్ని నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత గిన్నెలో చేమ గడ్డ దుంపలు, పసుపు, తగినన్ని నీళ్లు పోసి 80 శాతం ఉడికించాలి. తరువాత వీటిపై ఉండే పొట్టును తీసేసి గుండ్రంగా పావు ఇంచు మందంతో ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేమగడ్డ ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత మెంతులు, ఆవాలు వేసి వేయించాలి.
తరువాత కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, సాంబార్ ఉల్లిపాయలు వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పసుపు, ఉప్పు వేసి ఉల్లిపాయ ముక్కలు మెత్తబడిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్, చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. దీనిని రెండు పొంగులు వచ్చే వరకు ఉడికించిన తరువాత వేయించిన చేమగడ్డ ముక్కలు వేసి కలపాలి. దీనిపై మూత పెట్టి చిన్న మంటపై 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తరువాత పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చేమగడ్డ కారం పులుసు తయారవుతుంది. దీనిని అన్నం, దోశ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. చేమగడ్డలతో తరచూ చేసే వంటకాలతో పాటు అప్పుడప్పుడూ ఇలా కారం పులుసును కూడా తయారు చేసుకుని తినవచ్చు.