Chinthakaya Boti Curry : ప‌చ్చి చింత‌కాయ‌ల‌ను బోటిలో వేసి క‌లిపి వండండి.. కూర అదిరిపోతుంది..!

Chinthakaya Boti Curry : మన తెలుగు రాష్ట్రాల్లో బోటీ కర్రీకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రజలు బోటి అంటే ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. బోటీతో మసాల కర్రీ, బోటి ఫ్రై ఇలా వివిధ రకాలుగా వండుతూ ఉంటారు. కానీ కొద్దిగా పులుపు ఉండే విధంగా ఏమైనా కొత్తగా ట్రై చేయాలనుకునే వారు పచ్చి చింతకాయలతో బోటి న వండితే అద్భుతంగా ఉంటుంది. ఈ సీజన్ లో చింతకాయలు మార్కెట్లో విరివిగా అందుబాటులో ఉంటాయి కాబట్టి రుచితోపాటు వెరైటీని కోరుకునే వారు ఒకసారి ఇలా ప్రయత్నించవచ్చు. ఇక పచ్చి చింతకాయలతో బోటి కర్రీని ఎలా త‌యారుచేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

చింతకాయ బోటి కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు..

బోటి – పావుకిలో, చింతకాయలు – 4 లేదా 5, ఉల్లిపాయలు- 3, పచ్చిమిర్చి-4, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్, ధనియాల పొడి- 1 స్పూన్, జీలకర్ర పొడి – 1 స్పూన్, గరం మసాల పొడి- 2 స్పూన్లు, శ‌నగ పిండి – 2 స్పూన్లు, పసుపు- 1 స్పూన్, కారం- 1 స్పూన్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు – తగినంత, నూనె – తగినంత.

Chinthakaya Boti Curry make this dish in telangana style
Chinthakaya Boti Curry

చింత‌కాయ బోటి క‌ర్రీని త‌యారు చేసే విధానం..

ముందుగా ముక్కలుగా తరిగిన బోటిని బాగా కడిగి శుభ్రం చేసి కుక్కర్ లో వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చింతకాయలను కొద్దిగా నీటిలో ఉడికించి వాటి గుజ్జును తీసుకోవాలి. తరువాత స్ట‌వ్ పై ఒక కళాయిలో నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయలు రంగు మారిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, బోటి ముక్కలు వేసి ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత అందులో ముందుగా తీసిపెట్టుకున్న చింతకాయల గుజ్జును వేసి కలపాలి.

ఇప్పుడు కొద్దిగా నీటిలో శ‌నగపిండి వేసి జారుగా కలుపుకొని బోటి కర్రీ లో కలుపుకోవాలి. ఇప్పుడు కర్రీలో చిక్కని గ్రేవీలా తయారవుతుంది. తరువాత అందులో ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా మొదలైనవి వేసి కలుపుకొని దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చివరగా దానిపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన చింతకాయ బోటి కర్రీ త‌యార‌వుతుంది. దీన్ని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. అన్నం లేదా రోటీ వేటితో అయినా స‌రే ఈ కూర‌ను తిన‌వ‌చ్చు. రుచి అద్భుతంగా ఉంటుంది.

Prathap

Recent Posts