Chukkakura Pachadi : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో చుక్కకూర కూడా ఒకటి. చుక్కకూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో ఎన్నో సూక్ష్మ పోషకాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. చుక్కకూరతో మనం ఎక్కువగా పప్పును తయారు చేస్తూ ఉంటాము. కేవలం పప్పే కాకుండా చుక్కకూరతో మనం పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. చుక్కకూర పచ్చడి పుల్ల పుల్లగా చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని చూస్తే నోట్లో నీళ్లురాల్సిందే. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చుక్కకూరతో రుచిగా పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
చుక్కకూర పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – ఒక టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి – 8, వెల్లుల్లి రెమ్మలు – 6, చుక్కకూర – 100 గ్రా., ఉప్పు – తగినంత.
తాళింపుకు కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, శనగపప్ప – ఒక టేబుల్ స్పూన్, మినపప్పు – అర టీ స్పూన్,ఎండుమిర్చి – 2, జీలకర్ర – ఒక టీ స్పూన్, కరివేపాకు – ఒక రెమ్మ.
చుక్కకూర పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత చుక్కకూర వేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. చుక్కకూర మగ్గిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత జార్ లో పల్లీలు, జీలకర్ర వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత వేయించిన చుక్కకూర, పచ్చిమిర్చి, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత దీనిని పచ్చడిలో వేసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే చుక్కకూర పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చుక్కకూరతో చేసిన పచ్చడిని అందరూ లొట్టలేసుకుంటూ ఎంతో ఇష్టంగా తింటారు.