Dandruff : మనల్ని వేధించే వివిధ రకాల జుట్టు సమస్యలల్లో చుండ్రు సమస్య కూడా ఒకటి. వయసుతో సంబంధం లేకుండా ఈ సమస్య అందరినీ వేధిస్తుంది. ఈ చిన్న సమస్యతో మనలో చాలా మంది సంవత్సరాల తరబడి బాధపడుతూ ఉంటారు. ఈ సమస్య నుండి బయటపడడానికి రకరకాల ట్రీట్ మెంట్ లను, షాంపులను, ఇంటి చిట్కాలను వాడుతూ ఉంటారు. అయినప్పటికి ఈ సమస్య నుండి బయటపడలేకపోతుంటారు. అయితే అవగాహన లోపం వల్లే ఈ సమస్యతో బాధపడుతుంటారని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా మన శరీరం వ్యర్థాలను, వివిధ రకాల లవణాలను, విష పదార్థాలను చెమట రూపంలో బయటకు పంపిస్తుంది. మనం పని చేసేటప్పుడు శరీరం చల్లబడడానికి శరీరమంతా చెమట పడుతుంది. అదేవిధంగా తలలో కూడా చెమట పడుతుంది.
అయితే మనం రోజూ శరీరాన్ని శుభ్రం చేసుకుంటాము. కానీ తలను వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే శుభ్రం చేసుకుంటాము. తలలో ఉన్న చెమట కొంత సమయానికి ఆవిరైపోతుంది. నీరు ఆవిరై పోయి చెమటలో ఉండే వ్యర్థాలు తల చర్మంపై పేరుకుపోతాయి. అలాగే తల చర్మం కణాలు ప్రతిరోజూ కొన్ని చనిపోతూ ఉంటాయి. ఇలా నశించిన చర్మ కణాలు, అలాగే చెమటలో ఉండే వ్యర్థాలు, ట్యాక్సిన్స్ అన్ని పేరుకుపోయి తల చర్మంపై అట్టలాగా పేరుకుపోతాయి. ఇదే చుండ్రులా మారిపోతుంది. దీనికి గాలిలో ఉండే బ్యాక్టీరియాలు చేరి నిల్వ ఉండి వాటి సంతతిని వృద్ది చేసుకుంటాయి. దీంతో ఆ భాగంలో ఇన్పెక్షన్ వచ్చి దురద వస్తుంది. తలను రోజూ శుభ్రం చేసుకోకపోవడం వల్ల తలలో ఉండే వ్యర్థాలే చుండ్రుగా మారిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
చుండ్రు సమస్యతో బాధపడే వారు ఎటువంటి షాంపులు, ట్రీట్ మెంట్ లు చేయించుకునే అవసరం లేదని కేవలం నీటిని ఉపయోగించి ఈ సమస్య నుండి బయట పడవచ్చని నిపుణులు చెబుతున్నారు. చుండ్రును దూరం చేసే షాంపు అన్ని మార్కెట్ లో లభిస్తూ ఉంటాయి. అయితే ఏ షాంపు కూడా చుండ్రును పూర్తిగా నయం చేయదని కేవలం నీటితో రోజూ తలను శుభ్రం చేసుకుంటే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. తలస్నానం చేసేటప్పుడు వేళ్లతో తల చర్మాన్ని బాగా రుద్ది చేయడం వల్ల చుండ్ర సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని వారు తెలియజేస్తున్నారు.రోజూ తలస్నానం చేయడం వల్ల ఎన్నో ఏళ్లుగా వేధించే చుండ్రు సమస్య అయినా కూడా సులభంగా తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.