Paramannam : పరమాన్నం.. ఈ పేరు వినని వారు, దీని రుచి చూడని వారు ఉండరు ఉంటే అది అతిశయోక్తి కాదు. పరమాన్నం ఎంత రుచిగా ఉంటుందో మనందరికీ తెలుసు. దీనిని పూర్తిగా బెల్లంతో లేదా చక్కెరతో, రెండింటినీ కలిపి కూడా తయారు చేస్తూ ఉంటారు. కొందరికి పరమాన్నాన్ని తయారు చేసేటప్పుడు ఇందులో వేసిన పాలు విరిగి పోతూ ఉంటాయి. పాలు విరగకుండా రుచిగా పరమాన్నాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పరమాన్నం తయారీకి కావల్సిన పదార్థాలు..
బియ్యం – ఒక కప్పు, పాలు – 5 కప్పులు, బెల్లం – 2 కప్పులు, జీడి పప్పు – ఒక టేబుల్ స్పూన్, ఎండు ద్రాక్ష – ఒక టేబుల్ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, యాలకుల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – తగినన్ని.
పరమాన్నం తయారీ విధానం..
ముందుగా బియ్యాన్ని బాగా కడిగి తగినన్ని నీళ్లను పోసి నానబెట్టుకోవాలి. ఇప్పడు పరమాన్నం తయారు చేయడానికి వీలుగా ఉండే ఒక గిన్నెను తీసుకుని అందులో పాలను, రెండు కప్పుల నీటిని పోసి మరిగించుకోవాలి. పాలు మరిగిన తరువాత నీళ్లను కాకుండా నానబెట్టుకున్న బియ్యాన్ని మాత్రమే వేసి మధ్యస్థ మంటపై మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. బియ్యం మెత్తగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు బెల్లాన్ని వేసి కలుపుకోవాలి. తరువాత ఒక చిన్న కళాయిలో నెయ్యి వేసి కాగాక జీడిపప్పు, ఎండు ద్రాక్ష వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించి, ముందుగా ఉడికించి పెట్టుకున్న మిశ్రమంలో వేసి కలుపుకోవాలి.
ఇప్పడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి ఉడికించి పెట్టుకున్న మిశ్రమాన్ని స్టవ్ మీద ఉంచి యాలకుల పొడి వేసి మరో నిమిషం పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలు విరగకుండా ఉండడంతోపాటు ఎంతో రుచిగా ఉండే పరమాన్నం తయారవుతుంది. పరమాన్నం తయారు చేయడానికి బియ్యాన్ని తీసుకున్న కప్పుతో బెల్లాన్ని, పాలను తీసుకోవాలి. ఇందులో ఇతర డ్రై ఫ్రూట్స్ ను, పచ్చి కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవచ్చు. పరమాన్నం తయారీలో చక్కెరను కూడా వాడవచ్చు. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తింటేనే పరమాన్నం చాలా రుచిగా ఉంటుంది.