Crispy Prawns Fry : ప‌చ్చి రొయ్య‌ల‌ను ఇలా ఫ్రై చేస్తే చాలు.. క‌ర‌క‌ర‌లాడుతాయి..!

Crispy Prawns Fry : ఈ వీకెండ్ లో నాన్ వెజ్ వంట‌కం ఏది చేసుకోవాల‌ని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది మీ కోసమే. కింద‌ చెప్పిన విధంగా రొయ్య‌ల‌తో క్రిస్పీగా ఫ్రైను చేసుకుని తిన్నారంటే మీరు ఎంత బాగుంది అన‌క మాన‌రు. రొయ్య‌ల‌తో చేసే ఫ్రై చాలా రుచిగా ఉంటుంది. వీటిని స్నాక్స్ లా ఇలాగే తిన‌వ‌చ్చు లేదా ప‌ప్పు, సాంబార్ తో సైడ్ డిష్ గా కూడా తినవ‌చ్చు. ఈ క్రిస్పీ రొయ్య‌ల ఫ్రైను త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. క‌ర‌క‌ర‌లాడుతూ ఉండే రొయ్య‌ల ఫ్రైను అందరికి న‌చ్చేలా ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

క్రిస్పీ రొయ్య‌ల ఫ్రై త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

రొయ్య‌లు – 400 గ్రా., ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒకటిన్న‌ర టీ స్పూన్, ఉప్పు- త‌గినంత‌, ప‌సుపు – పావు టీ స్పూన్, నిమ్మ‌ర‌సం – అర చెక్క‌, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకు స‌రిప‌డా, కార్న్ ఫ్లోర్ – 2 టీ స్పూన్స్, బ్రెడ్ క్రంబ్స్ – 4 టీ స్పూన్స్.

Crispy Prawns Fry recipe in telugu make in this method
Crispy Prawns Fry

క్రిస్పీ రొయ్య‌ల ఫ్రై త‌యారీ విధానం..

ముందుగా రొయ్య‌ల‌ను శుభ్రంగా క‌డిగి నీళ్లు లేకుండా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో ధ‌నియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ప‌సుపు, నిమ్మ‌ర‌సం, కొత్తిమీర వేసి బాగా క‌ల‌పాలి. త‌రువాత దీనిపై మూత పెట్టి అర గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత ఒక ప్లేట్ లో బ్రెడ్ క్రంబ్స్, కార్న్ ఫ్లోర్ వేసి అంతా క‌లిసేలా క‌లుపుకోవాలి. త‌రువాత మ్యారినేట్ చేసుకున్న రొయ్య‌ల‌ను ఒక్కో దానిని తీసుకుంటూ కార్న్ ప్లోర్ మిశ్ర‌మంలో వేసుకోవాలి. త‌రువాత ఈ మిశ్ర‌మం రొయ్య‌లకు చ‌క్క‌గా ప‌ట్టేలా కోట్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత క‌ళాయిలో నూనె పోసి వేడి చేయాలి.

నూనె వేడ‌య్యాక ఒక్కో రొయ్య‌ను నెమ్మ‌దిగా నూనెలో వేసుకోవాలి. వీటిని రెండు నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత అటూ ఇటూ క‌దుపుతూ వేయించుకోవాలి. మ‌ధ్య‌స్థ మంట‌పై రెండు వైపులా క్రిస్పీగా ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్య‌ల ఫ్రై త‌యార‌వుతుంది. ఒక్క‌టి కూడా విడిచి పెట్ట‌కుండా వీటిని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు. రొయ్య‌ల‌తో త‌ర‌చూ చేసే వంట‌కాల‌తో పాటు ఇలా రొయ్య‌ల ఫ్రైను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

D

Recent Posts