Egg Biryani : కోడిగుడ్లతో సహజంగానే చాలా మంది రకరకాల ఆహారాలను తయారు చేస్తుంటారు. కోడిగుడ్ల కూర, టమాటా, ఫ్రై, ఆమ్లెట్.. ఇలా చాలా రకాలుగా గుడ్లను వండుకుని తింటుంటారు. అయితే వీటితో బిర్యానీ కూడా తయారు చేయవచ్చు. అది ఎంతో రుచిగా ఉంటుంది. ఈ క్రమంలోనే కోడి గుడ్ల బిర్యానీని రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎగ్ బిర్యానీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన ఎగ్స్ – 5, నానబెట్టిన బాస్మతి బియ్యం – రెండు కప్పులు (300 గ్రా.), పెరుగు – పావు కప్పు, కారం – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – అర టీ స్పూన్, నెయ్యి – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, తరిగిన ఉల్లిపాయలు – 3, అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్స్, సన్నగా, పొడగ్గా తరిగిన ఉల్లిపాయలు – 2 (పెద్దవి), తరిగిన టమాట – 2 (పెద్దవి), నూనె – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 5 కప్పులు.
మసాలా దినుసులు..
లవంగాలు – 6, దాల్చిన చెక్క – 1, అనాస పువ్వు – 1, మిరియాలు – 10, సాజీరా – అర టీ స్పూన్, బిర్యానీ ఆకు – ఒకటి.
ఎగ్ బిర్యానీ తయారీ విధానం..
ముందుగా కళాయిలో మసాలా దినుసులను వేసి వేయించి చల్లగా అయిన తరువాత జార్ లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. తరువాత అదే కళాయిలో ఒక టీ స్పూన్ నూనె వేసి ఉడికించిన ఎగ్స్ ను వేసి 2 నిమిషాల పాటు వేయించాలి. తరువాత చిటికెడు పసుపు, ఉప్పు, కారం వేసి మరో 2 నిమిషాల పాటు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు మరో కళాయిలో నెయ్యి, నూనెను వేసి తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి ఉల్లిపాయలను పూర్తిగా వేయించిన తరువాత టమాట ముక్కలను కూడా వేసి వేయించాలి. టమాట ముక్కలు వేగేటప్పుడే పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి.
ఇప్పుడు మూత పెట్టి టమాట ముక్కలను పూర్తిగా ఉడికించాలి. ఇవి పూర్తిగా ఉడికిన తరువాత పెరుగును వేసి కలపాలి. తరువాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడిని, ధనియాల పొడిని వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత వేయించి పెట్టుకున్న ఎగ్స్ ను వేసి కలపాలి. తరువాత నానబెట్టుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి కలిపి 5 కప్పుల నీళ్లను, తరిగిన కొత్తిమీరను వేసి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఎగ్ బిర్యానీ తయారవుతుంది. నిమ్మరసం, ఉల్లిపాయతో కలిపి తింటే ఎట్ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. ఎగ్స్ తో తరచూ చేసే వంటకాలకు బదులుగా అప్పుడప్పుడూ ఇలా బిర్యానీని చేసుకుని తినడం వల్ల రుచిగా ఉండడమే కాకుండా ఎగ్స్ ను తినడం వల్ల కలిగే ప్రయోజనాలను పొందవచ్చు.