Crispy Pesarattu : మనం ఉదయం అల్పాహారంలో భాగంగా రకరకాల ఆహార పదార్థాలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఇలా తయారు చేసే వాటిల్లో పెసరట్టు కూడా ఒకటి. పెసరట్టు రుచి గురించి ఎంత చెప్పినా తక్కువే. పెసరట్టుపై ఉల్లిపాయలను వేసి ఉల్లిపాయ పెసరట్టును కూడా తయారు చేస్తూ ఉంటాం. చాలా మంది క్రిస్పీగా ఉండే పెసరట్టును ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఎంత ప్రయత్నించినా కొందరికి కరకరలాడే విధంగా ఉండే పెసరట్టును తయారు చేసుకోవడం రాదు. కొన్ని చిట్కాలను పాటించడం వల్ల పేపర్ లా, కరకరలాడుతూ ఉండే పెసరట్టును మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. ఇక కరకరలాడుతూ ఉండే పెసరట్టును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
క్రిస్పీ పెసరట్టు తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసలు – 200 గ్రా., బియ్యం – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – తగినన్ని, తరిగిన అల్లం – 2 టేబుల్ స్పూన్స్, పచ్చి మిర్చి – 4, కరివేపాకు – ఒక రెబ్బ, జీలకర్ర – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – రుచికి తగినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, కారం – పావు టీ స్పూన్, నూనె – ఒక కప్పు.
క్రిస్పీ పెసరట్టు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెసలను, బియ్యాన్ని వేసి కడిగి తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు లేదా ఒక రాత్రి అంతా నానబెట్టాలి. పెసలు ఎంత ఎక్కువగా నానితే పెసరట్టు అంత క్రిస్పీ గా వస్తుంది. ఇలా నానబెట్టిన పెసలను జార్ లో వేసి వీటితోపాటు అల్లం, పచ్చి మిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి కొద్ది కొద్దిగా నీళ్లను పోస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పెసరట్టు వేసే పిండి మామూలు దోశ పిండి కంటే కూడా కొద్దిగా గట్టిగా ఉండాలి. పెసరట్టు వేసే పిండి పలుచగా ఉంటే పెసరట్టు మెత్తగా ఉంటుంది. కనుక పిండి కొద్దిగా గట్టిగా ఉండేలా చూసుకోవాలి.
ఒక గిన్నెలో ఉల్లిపాయ ముక్కలు, కారం, కొద్దిగా ఉప్పు, తరిగిన కొత్తిమీరను వేసి కలిపి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనాన్ని ఉంచి పెనం వేడైన తరువాత అర టీ స్పూన్ నూనె వేసి పెనం అంతా నూనె వచ్చేలా టిష్యూ పేపర్ తో రుద్దుకోవాలి. ఇప్పుడు మంటను చిన్నగా చేసి పిండిని తీసుకుని వీలైనంత పలుచగా దోశలా వేసుకోవాలి. ఇప్పుడు పెనరట్టు తడి అంతా అరిపోయిన తరువాత కొద్దిగా నూనె వేసి ఎర్రగా అయ్యే వరకు కాల్చి ముందుగా కలిపి ఉంచిన ఉల్లిపాయ ముక్కలను వేసి.. ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల క్రిస్పీ గా ఉండే పెసరట్టు తయారవుతుంది. దీనిని పల్లీ చట్నీ, కొబ్బరి చట్నీలతో కలిపి తింటే చాలా రుచిగా ఉండడమే కాకుండా పెసలలో ఉండే పోషకాలను, వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా పొందవచ్చు.