Fried Masala Idli : మనం అల్పాహారంగా తీసుకునే వాటిల్లో ఇడ్లీ కూడా ఒకటి. ఇడ్లీని చాలా మంది ఇష్టంగా తింటారు. ఈ ఇడ్లీలతో మం అప్పుడప్పుడూ ఇడ్లీ ఉప్మాను కూడా తయారు చేస్తూ ఉంటాము. అలాగే వీటితో మనం ఫ్రైడ్ మసాలా ఇడ్లీలను కూడా తయారు చేసుకోవచ్చు. ఇడ్లీలను తినని వారు కూడా ఇలా చేసిన ఇడ్లీలను ఇష్టంగా తింటారు. ఇడ్లీలు ఎక్కువగా మిగిలినప్పుడు కూడా ఇలా మసాలా ఇడ్లీలను తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఫ్రైడ్ మసాలా ఇడ్లీలను ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రైడ్ మసాలా ఇడ్లీ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఇడ్లీలు – 7 నుండి 8, నూనె – 2 టీ స్పూన్స్, ఆవాలు – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 1, చిన్న ముక్కలుగా తరిగిన పచ్చిమిర్చి – 1, తరిగిన ఉల్లిపాయ – 1, తరిగిన టమాట – 1, పసుపు – చిటికెడు, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
ఫ్రైడ్ మసాలా ఇడ్లీ తయారీ విధానం..
ముందుగా ఇడ్లీలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత పచ్చిమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు వేయించాలి. టమాట ముక్కలు మెత్తబడిన తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరువాత ఇడ్లీ ముక్కలను వేసి కలపాలి. అంతా కలిసేలా కలుపుకున్న తరువాత మరో నిమిషం పాటు వేయించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఫ్రైడ్ మసాలా ఇడ్లీ తయారవుతుంది. వీటిని చట్నీ, సాంబార్ లేకుండానే నేరుగా ఇలాగే తినవచ్చు. ఈ విధంగా చేసిన ఇడ్లీ కూడా చాలా రుచిగా ఉంటుంది.