Garlic Peel Benefits : మనం వంటల్లో విరివిగా వాడే వాటిల్లో వెల్లుల్లి కూడా ఒకటి. వెల్లుల్లి వేయడం వల్ల వంటల రుచి పెరగడంతో పాటు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్య ప్రయోజనాలు, పోషకాలు దాగి ఉన్నాయి. వీటిని వాడడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఇన్పెక్షన్ ల బారిన పడకుండా ఉంటాము. శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మనకు చక్కటి ఆరోగ్యాన్ని అందించడంలో వెల్లుల్లి మనక ఎంతో దోహదపడుతుంది. అయితే మనం సాధారణంగా వెల్లుల్లి రెబ్బలను తీసుకుని వాటిపై ఉండే పొట్టును పడేస్తూ ఉంటాము. ఇది సహజంగా అందరూ చేసేదే.
అయితే వెల్లుల్లి రెబ్బలతో పాటు వెల్లుల్లిపై ఉండే పొట్టు కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని అలాగే దీనిని వివిధ రకాలుగా కూడా ఉపయోగించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. వెల్లుల్లి పొట్టును ఇతర ప్రయోజనాల కోసం ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం. వెల్లుల్లి పొట్టును నీటిలో వేసి మరిగించి టీ లా తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న టీని వడకట్టి తాగడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలాగే వెల్లుల్లి పొట్టును స్క్రబర్ గా కూడా ఉపయోగించవచ్చు. దీనితో కళాయిలను, మట్టి పాత్రలను శుభ్రం చేసుకోవచ్చు. అదే విధంగా బట్టలు ఉండే చోట వెల్లుల్లి పొట్టును కవర్ లో వేసి గోడకు తగిలించాలి. ఇలా చేయడం వల్ల గాలిలో ఉడే దుర్వాసన సులభంగా తొలగిపోతుంది. అలాగే ఈ పొట్టును చెట్లకు ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు.
ఇంట్లో తయారు చేసే కంపోస్ట్ ఎరువులో వెల్లుల్లి పొట్టు వేసి ఎరువును తయారు చేసి మొక్కలకు వేయవచ్చు. అలాగే ఒక జాడిలో వెల్లుల్లి పొట్టును తీసుకుని అది మునిగే వరకు ఆలివ్ నూనెను పోయాలి. తరువాత దీనిని కొన్ని రోజుల పాటు నిల్వ ఉంచిఆ తరువాత సలాడ్స్ లో ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఆలివ్ నూనెకు బదులుగా వెనిగర్ ను లేదా ఆపిల్ సైడ్ వెనిగర్ ను కూడా వాడవచ్చు. అదే విదంగా జార్ లో వెల్లుల్లి పొట్టును వేసి మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత దీనికి ఉప్పును కలిపి నిల్వ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని వంటల్లో వాడడం వల్ల వంటల రుచి పెరుగుతుంది. ఈ విధంగా వెల్లుల్లి పొట్టు కూడా మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుంది. దీనిని వాడడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.