Soft Jonna Rotte Tips : మన ఆరోగ్యానికి మేలు చేసే చిరుధాన్యాల్లో జొన్నలు కూడా ఒకటి. వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగిఉన్నాయి. జొన్నలను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. ఈ జొన్నలతో ఎక్కువగా మనం జొన్న రొట్టెలను తయారు చేస్తూ ఉంటాము. ప్రస్తుత కాలంలో జొన్న రొట్టెలను తినే వారు ఎక్కువవుతున్నారనే చెప్పవచ్చు. బరువు తగ్గడంలో, గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలో కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఈ జొన్న రొట్టెలు మనకు దోహదపడతాయని చెప్పవచ్చు. చాలా మంది వీటిని తయారు చేయడం చాలా కష్టమని భావిస్తారు. కానీ కింద చెప్పిన విధంగా చేయడం వల్ల మెత్తటి మృదువైన జొన్న రొట్టెలను చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. జొన్న రొట్టెలను మరింత సులభంగా, మెత్తగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడుతెలుసుకుందాం.
జొన్న రొట్టె తయారీకి కావల్సిన పదార్థాలు..
జొన్నపిండి – ఒక కప్పు, నీళ్లు – ముప్పావు కప్పు, ఉప్పు – చిటికెడు.
జొన్న రొట్టె తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో ఉప్పు వేసి వేడి చేయాలి. నీళ్లు మరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసా ఇందులో జొన్నపిండిని వేసి ముందుగా గంటెతో కలుపుకోవాలి. తరువాత చేతులకు తడి చేసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. దీనిని చపాతీ పిండిలా కలుపుకున్న తరువాత కొద్దిగా పిండిని తీసుకుని మిగిలిన పిండిపై మూత పెట్టి పక్కకు ఉంచాలి. ఇప్పుడుపిండిని ఉండలా చేసుకుని పొడి పిండిలో ముంచి చపాతీ కర్రతో వత్తుకోవాలి. ఈ రొట్టెను అటూ ఇటూ తిప్పకుండా పిండిని ఒకేసారి ఎక్కువగా వేసి వత్తుకోవాలి. అవసరమైతే పైన కొద్దిగా పిండిని చల్లుకుంటూ రొట్టెలా చేసుకోవాలి. తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి.
పెనం వేడయ్యాక పిండి ఎక్కువగా ఉండే అడుగు భాగం పైకి వచ్చేలా పెనం మీద వేసుకోవాలి. తరువాత రొట్టెపై నీటిని చల్లుకుని శుభ్రమైన కాటన్ వస్త్రంతో రొట్టె అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత దీనిని అటూ ఇటూ తిప్పుడూ రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా, మెత్తగా ఉండే జొన్న రొట్టెలు తయారవుతాయి. రొట్టె తయారు చేసేటప్పుడు అంచులు పగిలిపోతే చేత్తో వత్తుకోవాలి. లేదంటే అంచు పదునుగా ఉండే గిన్నెను రొట్టె మీద ఉంచి గుండ్రంగా కట్ చేసుకుని కాల్చుకోవాలి. ఇలా తయారు చేసిన జొన్న రొట్టెలను తినడంవల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది.