Gobi Manchurian : గోబి మంచూరియా.. ప‌క్కా రెస్టారెంట్ రుచి రావాలంటే.. ఇలా చేయాలి..!

Gobi Manchurian : మ‌న‌కు బ‌య‌ట రెస్టారెంట్ల‌లో, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌ల్లో ల‌భించే ఆహార ప‌దార్థాల్లో గోబి మంచూరియా కూడా ఒక‌టి. దీనిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. గోబి మంచూరియా చాలా రుచిగా కూడా ఉంటుంది. బ‌య‌ట ల‌భించే విధంగా ఉండే ఈ మంచూరియాను మ‌నం చాలా సుల‌భంగా అదే రుచి వ‌చ్చేలా ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. గోబి మంచూరియాను ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

గోబి మంచూరియా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

పెద్ద ముక్క‌లుగా త‌రిగిన కాలిఫ్ల‌వ‌ర్ – ఒక క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌, మిరియాల పొడి – అర టీ స్పూన్, చిల్లీ ఫ్లేక్స్ – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – 2 టేబుల్ స్పూన్స్, మైదా పిండి – ఒక టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి స‌రిప‌డా, చిన్న‌గా తరిగిన వెల్లుల్లి రెబ్బ‌లు – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1, ట‌మాట సాస్ – ఒక టేబుల్ స్పూన్, గ్రీన్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, రెడ్ చిల్లీ సాస్ – ఒక టీ స్పూన్, సోయా సాస్ – అర టీ స్పూన్, వెనిగ‌ర్ – అర టీ స్పూన్, త‌రిగిన స్ప్రింగ్ ఆనియ‌న్స్ – కొద్దిగా.

Gobi Manchurian make just like restaurant style
Gobi Manchurian

గోబి మంచూరియా త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో నీటిని తీసుకుని అందులో ఒక టీ స్పూన్ ఉప్పును వేసి వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక కాలిఫ్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి 2 నుండి 3 నిమిషాల పాటు ఉడికించాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను నీటి నుండి వేరు చేసి చ‌ల్ల‌టి నీటితో క‌డ‌గాలి. ఇలా క‌డిగిన త‌రువాత ఈ ముక్క‌ల‌ను ఒక గిన్నెలోకి తీసుకుని అందులో ఉప్పు, మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్ వేసి క‌లుపుకోవాలి. త‌రువాత కార్న్ ఫ్లోర్, మైదా పిండి వేసి క‌లుపుకోవాలి. అవ‌స‌ర‌మైతే కొద్దిగా నీటిని చ‌ల్లుకుని క‌ల‌పాలి. త‌రువాత ఒక క‌ళాయిలో నూనె పోసి నూనె కాగిన త‌రువాత ముందుగా సిద్దం చేసుకున్న కాలిఫ్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి.

ఈ ముక్క‌ల‌ను మ‌ధ్య‌స్థ మంట‌పై క‌ర‌క‌ర‌లాడే వ‌ర‌కు వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు క‌ళాయిలో ఒక‌టిన్న‌ర టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడ‌య్యాక వెల్లుల్లి ముక్క‌లు, ప‌చ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. త‌రువాత ఉల్లిపాయ ముక్క‌లు వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. త‌రువాత ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ ను, రెండు టేబుల్ స్పూన్ల నీటిని వేసి ఉండ‌లు లేకుండా క‌లుపుకోవాలి. ఇలా త‌యారు చేసుకున్న కార్న్ ఫ్లోర్ నీటిని ఉల్లిపాయ ముక్క‌లు వేగిన త‌రువాత అందులో వేసి క‌లుపుకోవాలి.

త‌రువాత స్ప్రింగ్ ఆనియ‌న్స్ త‌ప్ప మిగిలిన ప‌దార్థాల‌న్ని వేసి క‌లుపుకోవాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత ముందుగా ఫ్రై చేసిన కాలిఫ్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను వేసి అంతా క‌లిసేలా బాగా క‌లుపుకోవాలి. ఈ కాలిఫ్ల‌వ‌ర్ ముక్క‌ల‌ను మ‌రో 2 నిమిషాల పాటు వేయించి చివ‌ర‌గా స్ప్రింగ్ ఆనియన్స్ ను చ‌ల్లి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే గోబి మంచూరియా త‌యార‌వుతుంది.

D

Recent Posts