Goruchikkudu Kaya Kobbari Fry : మనం ఆహారంగా తీసుకునే కూరగాయల్లో గోరు చిక్కుడు కూడా ఒకటి. ఇతర కూరగాయల వలె గోరు చిక్కుడు కూడా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో కూడా అనేక పోషకాలు దాగి ఉన్నాయి. కానీ చాలా మంది దీనిని తినడానికి ఇష్టపడరు. గోరు చిక్కుడును తినడానికి ఇష్టపడని వారు కూడా ఇష్టంగా తినేలా దీనితో మనం వేపుడును తయారు చేసుకోవచ్చు. పచ్చి కొబ్బరి తురుము వేసి చేసే ఈ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం కూడా చాలా తేలిక. ఎవరైనా కూడా సులభంగా చేసుకునేలా అలాగే రుచిగా గోరు చిక్కుడుతో వేపుడును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
గోరు చిక్కుడు కొబ్బరి ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన గోరు చిక్కుడు – పావు కిలో, నూనె – 2 టేబుల్ స్పూన్స్, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, పచ్చి కొబ్బరి తురుము – అర చెక్క కొబ్బరితో తయారు చేసినంత.
గోరు చిక్కుడు కొబ్బరి ఫ్రై తయారీ విధానం..
ముందుగా తరిగిన గోరు చిక్కుడు ముక్కలను ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు, ఉప్పు వేసి ఉడికించాలి. గోరు చిక్కుడు ఉడికిన తరువాత నీటిని వడకట్టుకుని పక్కకు పెట్టుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. తాళింపు వేగిన తరువాత ఉడికించుకున్న గోరుచిక్కుడు ముక్కలను, పసుపు వేసి కలపాలి. వీటిని 5 నిమిషాల పాటు వేయించుకున్న తరువాత కారం వేసి కలపాలి. తరువాత పచ్చి కొబ్బరి తురుము వేసి కలపాలి.
దీనిని 2 నిమిషాల పాటు కలుపుతూ వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే గోరు చిక్కుడు వేపుడు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ వంటి వాటితో తినడంతో పాటు సైడ్ డిష్ గా కూడా తినవచ్చు. ఈ విధంగా చేసిన గోరు చిక్కుడు వేపుడును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. ఈ విధంగా గోరు చిక్కుడుతో వేపుడును తయారు చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.