Healthy Vada : మనం సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా మసాలా వడలను తీసుకుంటూ ఉంటాము. మసాలా వడలు చాలా రుచిగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. సాధారణంగా ఈ వడలను మనం నూనెలో వేయించి తయారు చేస్తూ ఉంటాము. అయితే చాలా తక్కువ నూనె వాడి కూడా ఈ వడలను అంతే రుచిగా, క్రిస్పీగా, ఆరోగ్యానికి మేలు చేసేలా తయారు చేసుకోవచ్చు. కేవలం 2 టీ స్పూన్ల నూనెతో మనం ఎంతో రుచిగా ఉండే మసాలా వడలను తయారు చేసుకోవచ్చు. రుచితో పాటు చక్కటిఆరోగ్యాన్ని అందించే ఈ హెల్తీ వడలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్టు పెసరపప్పు – ఒక కప్పు, శనగపప్పు – అర కప్పు, బియ్యం – పావు కప్పు, పచ్చిమిర్చి – 2, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ – 1, జీలకర్ర – ఒక టీ స్పూన్, అల్లం తురుము – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, వంటసోడా – 2 చిటికెలు.
ముందుగా గిన్నెలో పెసరపప్పు, శనగపప్పు, బియ్యం వేసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 4 గంటల పాటు నానబెట్టాలి. తరువాత వీటిని నీరంతా పోయేలా చక్కగా వడకట్టాలి. తరువాత వీటిని జార్ లో వేసి, ఇందులోనే పచ్చిమిర్చి కూడా వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు స్టవ్ మీద మందంగా ఉండే పెనాని ఉంచి వేడి చేయాలి. తరువాత దానిపై నూనెను రాసుకోవాలి. ఇప్పుడు పిండిని తీసుకుని పలుచగా ఉండే వడల్లాగా వత్తుకుని పెనం మీద వేసుకోవాలి. తరువాత వీటిపై మరికొద్దిగా నూనె వేసి అటూ ఇటూ తిప్పుతూ రెండు వైపులా ఎర్రగా, క్రిస్పీగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే హెల్తీ వడలు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి. ఇలా వడలను తయారు చేసుకుని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.