Ponnaganti Aaku : మనం ఆహారంగా తీసుకునే ఆకుకూరల్లో పొన్నగంటి కూర కూడా ఒకటి. ఈ కూర ఎక్కువగా వర్షాకాలంలో దొరుకుతుంది. వినాయక చవితి రోజూ ఈ ఆకుకూరను చాలా మంది తప్పకుండా వండుకుని తింటూ ఉంటారు.ఈ ఆకుకూరతో ఎక్కువగా పప్పు, కూర, వేపుడు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. పొన్నగంటితో చేసే వంటకాలు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు కలుగుతుంది. ఇతర ఆకుకూరల వలె పొన్నగంటి కూర కూడా ఎన్నో పోషకాలను, ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది. దీనిని ఇతర ఆకుకూరల వలె ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
పొన్నగంటిని కూరను తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పొన్నగంటి కూరను తీసుకోవడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. కంటికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. శరీరంలో జీవక్రియల రేటును మెరుగుపరచడంలో కూడా పొన్నగంటి కూర మనకు దోహదపడుతుంది. పొన్నగంటి కూరను తీసుకోవడం వల్ల పురుషుల్లో లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. ఇక మధుమేహ వ్యాధి గ్రస్తులకు కూడా పొన్నగంటి కూర మేలు చేస్తుంది. దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కీళ్ల నొప్పులు, నరాల నొప్పులు, నడుము నొప్పి వంటి సమస్యలతో బాధపడే వారు పొన్నగంటి కూరను తీసుకోవడం వల్ల నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది.
అలాగే పొన్నగంటి ఆకుల నుండి ఒక టేబుల్ స్పూన్ రసాన్ని తీసుకోవాలి. ఈ రసాన్ని వెల్లుల్లితో కలిపి తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా వేధిస్తున్న దగ్గు, ఆస్థమా వంటి సమస్యలు తగ్గుతాయి. అదే విధంగా జీర్ణశక్తిని పెంచి మలబద్దకం వంటి సమస్యలను తగ్గించడంలో కూడా పొన్నగంటి ఆకు మనకు దోహదపడుతుంది. ఈ విధంగా పొన్నగంటి కూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని దీనిని కూడా తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.