Egg Puff : ఓవెన్ లేకుండానే బేక‌రీల్లో ల‌భించే విధంగా.. ఎగ్ ప‌ఫ్స్‌ను ఇలా త‌యారు చేసుకోండి..!

Egg Puff : మ‌న‌కు బ‌య‌ట బేక‌రీల్లో ల‌భించే ప‌దార్థాల్లో ఎగ్ ప‌ఫ్స్ కూడా ఒక‌టి. ఇవి ఎంత రుచిగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌వ‌ల‌సిన ప‌ని లేదు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంద‌రూ వీటిని ఇష్టంగా తింటుంటారు. బ‌య‌ట దొరికే విధంగా ఉండే ఈ ఎగ్ ప‌ఫ్స్ ను మం ఇంట్లో కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. క‌ర‌క‌ర‌లాడుతూ రుచిగా ఉండే ఈ ఎగ్ ప‌ఫ్స్ ను ఇంట్లో ఏవిధంగా త‌యారు చేసుకోవాలి.. వీటి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఎగ్ ప‌ఫ్స్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మైదా పిండి – ఒక క‌ప్పు, పంచ‌దార – పావు టీ స్పూన్, ఉప్పు – పావు టీ స్పూన్, చ‌ల్ల‌ని నీళ్లు – త‌గిన‌న్ని, వెన్న – 50 గ్రా..

కోడిగుడ్డు మిశ్ర‌మం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ఉడికించిన కోడిగుడ్లు – 2, నూనె – ఒక టేబుల్ స్పూన్, చిన్న‌గా త‌రిగిన ప‌చ్చి మిర్చి – 1, చిన్న‌గా త‌రిగిన ఉల్లిపాయ – 1 (మ‌ధ్య‌స్థంగా ఉన్న‌వి), ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్, కారం – అర టీ స్పూన్, ప‌సుపు – చిటికెడు, ధ‌నియాల పొడి – అర టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – అర టీ స్పూన్, చాట్ మ‌సాలా – అర టీ స్పూన్, నీళ్లు – రెండు టేబుల్ స్పూన్స్.

here it is how you can make Egg Puff
Egg Puff

ఎగ్ ప‌ఫ్ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మైదా పిండిని, ఉప్పును, పంచ‌దార‌ను తీసుకుని క‌లుపుకోవాలి. త‌రువాత త‌గిన‌న్ని నీళ్లు పోసి చ‌పాతీ పిండిలా క‌లుపుకోవాలి. త‌రువాత పిండి పై మూత‌ను ఉంచి 20 నిమిషాల పాటు నాననివ్వాలి. ఇలా నానిన త‌రువాత పిండిని తీసుకుని మ‌రో 2 నిమిషాల పాటు బాగా క‌లుపుకోవాలి. త‌రువాత ఈ పిండిని పొడి పిండి చ‌ల్లుకుంటూ అర ఇంచు మందంతో దీర్ఘ‌చ‌తుర‌స్రాకారంలో లేదా గుడ్డు ఆకారంలో చ‌పాతీలా రుద్దుకోవాలి. త‌రువాత దీనిపై 25 గ్రాముల వెన్న‌ను అన్ని మూల‌ల‌కు వ‌చ్చేలా అంత‌టా రాయాలి. ఇలా వెన్న రాసిన త‌రువాత దీనిపై మ‌రి కొద్దిగా మైదా పిండిని చ‌ల్లుకోవాలి.

ఇప్పుడు రెండు అంచుల‌ను కూడా మ‌ధ్య‌లోకి మ‌లిచి మ‌ర‌లా ఒక దానిపై ఒక‌టి వ‌చ్చేలా మ‌ర‌లా మ‌లుచుకోవాలి. ఇలా మలిచిన దీనిని ఒక ట్రేలోకి తీసుకుని దానిపై పొడి పిండిని చ‌ల్లి అలాగే త‌డి గుడ్డ‌ను ఉంచి డీప్‌ ఫ్రిజ్ లో 20 నిమిషాల పాటు ఉంచుకోవాలి. 20 నిమిషాల త‌రువాత మైదా పిండి మిశ్ర‌మాన్ని బ‌య‌ట‌కు తీసి ముందు చేసిన విధంగా పొడి పిండి చ‌ల్లుకుంటూ చ‌పాతీలా చేసుకుని దానిపై మ‌ర‌లా మిగిలిన వెన్న‌ను రాసి ముందు మ‌లిచిన విధంగా మ‌ర‌లా మ‌లవాలి. త‌రువాత దీనిపై కూడా పొడి పిండిని చ‌ల్లి త‌డి గుడ్డ‌ను ఉంచి మ‌ర‌లా 20 నిమిషాల పాటు డీప్‌ ఫ్రిజ్ లో ఉంచాలి.

ఇప్పుడు ఒక క‌ళాయిలో నూనె వేసి నూనె వేడయ్యాక ప‌చ్చి మిర్చిని, ఉల్లిపాయ ముక్క‌ల‌ను వేసి వేయించుకోవాలి. త‌రువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ప‌చ్చి వాస‌న పోయే వ‌ర‌కు వేయించుకోవాలి. త‌రువాత ఉప్పు, కారం, చాట్ మ‌సాలా, ధనియాల పొడి, జీల‌క‌ర్ర పొడి వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. త‌రువాత నీళ్లు పోసి ఒక నిమిషం పాటు వేయించి స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. అలాగే ఉడికించిన కోడిగుడ్ల‌ను నిలువుగా రెండు భాగాలుగా చేసి వాటిపై కొద్దిగా ఉప్పును, కారాన్ని, మిరియాల పొడిని చ‌ల్లి ప‌క్క‌కు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిజ్ లో పెట్టుకున్న మైదా పిండి మిశ్ర‌మాన్ని బ‌య‌ట‌కు తీసి రెండు స‌మాన భాగాలుగా చేసుకోవాలి.

త‌రువాత ఒక స‌గ భాగాన్ని తీసుకుని మైదా పిండిని చ‌ల్లుకుంటూ చ‌తుర‌స్రాకారంలో చ‌పాతీలా రుద్దుకోవాలి. త‌రువాత దీనిని నాలుగు స‌మాన‌ భాగాలుగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో దానిపై ఉల్లిపాయ మిశ్ర‌మాన్ని ఉంచుతూ అలాగే కోడిగుడ్డును కూడా బోర్లించి ఉంచాలి. ఇప్పుడు అంచుల‌కు నీళ్లు లేదా పాలు రాసుకుంటూ రెండు లేదా నాలుగు అంచుల‌ను కోడిగుడ్డుకు మీద‌కు వ‌చ్చేలా పెట్టుకోవాలి. ఇలా అన్నింటినీ త‌యారు చేసుకున్న త‌రువాత వాటిపై మ‌ర‌లా పాల‌ను కానీ వెన్న‌ను కానీ రాయాలి. త‌రువాత లోతుగా ఉండే గిన్నెను తీసుకుని దానిలో స్టాండ్ ను ఉంచి మూత పెట్టి 5 నిమిషాల పాటు వేడి చేయాలి.

ఇప్పుడు ఒక అల్యూమినియం ప్లేట్ ను తీసుకుని దానికి నెయ్యిని రాసి అందులో ముందుగా త‌యారు చేసుకున్న ఎగ్ ప‌ఫ్స్ ను ఉంచి గిన్నెలో పెట్టాలి. గిన్నెపై మూత‌ను ఉంచి 35 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై వేడి చేయాలి. త‌రువాత ఎగ్ ప‌ఫ్స్ ను తిర‌గేసి మ‌ర‌లా మూత పెట్టి చిన్న మంట‌పై 10 నిమిషాల పాటు వేడి చేయాలి. త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి బ‌య‌ట‌కు తీయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల బేక‌రీలో ల‌భించే విధంగా ఉండే ఎగ్ ప‌ఫ్స్ ను ఇంట్లోనే త‌యారు చేసుకోవచ్చు. ఇలా చేసే ఎగ్ ప‌ఫ్స్ ను అంద‌రూ ఇష్టంగా తింటారు.

D

Recent Posts