How To Clean Copper Water Bottle : మనం ఎక్కువగా ఉపయోగించే లోహాలల్లో రాగి కూడా ఒకటి. రాగి పాత్రలను ఎంతో కాలంగా ఉపయోగిస్తున్నాము. రాగి పాత్రలో నీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్నారు. పూర్వకాలంలో నీటిని తాగడానికి రాగి చెంబులను ఎక్కువగా ఉపయోగించేవారు. అయితే ఇప్పుడు చెంబులకు బదులుగా రాగి బాటిల్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. మనలో చాలా మంది రాగి బాటిల్స్ లో నీటిని తాగడం మొదలు పెట్టారు. రాత్రంతా ఇలా రాగి బాటిల్స్ నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. అలాగే ఈ బాటిల్స్ ను ఎక్కడికైనా చాలా సులభంగా తీసుకెళ్లవచ్చు.
రాగి బాటిల్స్ లో నీటిని తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. నీటిలో ఉండే బ్యాక్టీరియా, వైరస్ వంటి క్రిములు నశిస్తాయి. శరీరంలో మలినాలు తొలగిపోతాయి. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. రాగి బాటిల్స్ లో నీటిని తీసుకోవడం వల్ల ఇలా అనేక రకాలుగా మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అయితే రాగి బాటిల్స్ ను ఎక్కువగా వాడుకోవడం వల్ల బాటిల్స్ నల్లగా మారిపోతూ ఉంటాయి. అలాగే బాటిల్స్ అడుగున పాచి పేరుకుపోతుంది. సాధారణ బాటిల్స్ ను అయితే చాలా సులభంగా మనం శుభ్రం చేసుకోవచ్చు. కానీ రాగి బాటిల్స్ పై ఉండే నలుపును పొగొట్టడం కొద్దిగా కష్టంతో కూడిన పని చెప్పవచ్చు.
అయితే ఇప్పుడు చెప్పే చిట్కాలను పాటించడం వల్ల చాలా సులభంగా రాగి బాటిల్స్ ను శుభ్రం చేసుకోవచ్చు. అలాగే ఈ బాటిల్స్ తళతళ మెరిసేలా చేసుకోవచ్చు. రాగి బాటిల్స్ ను శుభ్రం చేసుకోవాలనుకునే వారు వెనిగర్ లో ఉప్పు వేసికలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని బాటిల్ పై రాయాలి. దీనిని 10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. తరువాత అదే వెనిగర్, ఉప్పు కలిపిన మిశ్రమాన్ని మరలా బాటిల్ లోపల పోసి బాగా కదపాలి. దీనిని మరో పది నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేయడం వల్ల రాగి బాటిల్స్ చాలా బాగా శుభ్రపడతాయి. అలాగే నిమ్మరసాన్ని ఉపయోగించడం వల్ల కూడా రాగి బాటిల్స్ చాలా బాగా శుభ్రపడతాయి. రాగి బాటిల్స్ పై నిమ్మరసంతో రుద్ది ఆ తరువాత శుభ్రం చేయాలి. ఇలా చేయడం బాటిల్స్ పై ఉండే నలుపు పోతుంది. అలాగే నిమ్మరసాన్ని బాటిల్ లోపల వేసి బ్రష్ తో రుద్దాలి. ఇలా చేయడం వల్ల లోపల ఉండే నలుపు తొలగిపోతుంది. అలాగే బాటిలో గోరు వెచ్చని నీళ్లు పోసి అందులో ఉప్పు, నిమ్మ చెక్కలు, వెనిగర్ వేసి బాగా కలపాలి. దీనిని అరగంట పాటు అలాగే ఉంచి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల రాగి బాటిల్స్ పూర్తిగా శుభ్రపడతాయి.