సాధారణంగా మనం ఎన్ని డబ్బులు సంపాదిస్తున్నప్పటికీ కొన్ని సార్లు అనేక ఆర్థిక ఇబ్బందులు, జాతక దోషాలు, మానసిక ఆందోళనలు మనల్ని చుట్టుముడతాయి. ఈ విధమైనటువంటి బాధల నుంచి బయటపడటానికి మనం ఎన్నో రకాల దేవదేవతలను పూజిస్తాము. అయితే వినాయకుడు అందరు దేవుళ్ళలోకల్లా ఎంతో ప్రత్యేకమైన దేవుడని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే వినాయకుడిని మనం వివిధ రూపాల్లో పూజిస్తాం. ఇలా ఎన్నో రూపాలలో దర్శనమిచ్చే వినాయకుడి రూపాలలో శ్వేతార్కమూల గణపతి ఒకటి.
శ్వేతార్కమూల అంటే తెల్లజిల్లేడు చెట్టు మొదలు అని అర్థం. హిందూ సాంప్రదాయాల ప్రకారం తెల్ల జిల్లేడు చెట్టును ఎంతో పవిత్రమైన చెట్టుగా భావిస్తారు. ఈ క్రమంలోనే ఈ తెల్లజిల్లేడు చెట్టును శ్వేతార్కమూల గణపతిగా భావించి పూజలు చేయటం వల్ల ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు, జాతక దోషాలు ఉండవని పండితులు చెబుతున్నారు. మరి ఈ గణపతి ని ఏ విధంగా పూజించాలి అనే విషయానికి వస్తే..
ఆదివారం, అమావాస్య, పుష్యమి నక్షత్రం కలసి వచ్చేటప్పుడు తెల్లజిల్లేడు చెట్టు మొదలును సేకరించడం అత్యంత శ్రేష్టం. ఆరోజు ఉదయాన్నే శుచిగా శుభ్రం చేసి మట్టిలో నుంచి శ్వేతార్కమూలం సేకరించి, మూలాన్ని శుభ్రంగా కడిగి పూజగదిలో ఎర్రని వస్త్రం పై ధూప దీప నైవేద్యాలతో పూజ చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. మరికొందరు ఈ జిల్లేడు కొమ్మపై వినాయకుడి ప్రతిమలు చేయించుకుని పూజలు చేస్తుంటారు. ఇలా శ్వేతార్క గణపతిని పూజించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు తెలియజేస్తున్నారు.